కమిషనర్ టు డీసీ.. అందరికీ ఈవీ వెహికల్స్.. సీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం

కమిషనర్ టు డీసీ.. అందరికీ ఈవీ వెహికల్స్.. సీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​2వ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం మాదాపూర్​లోని ఎన్ఎసీ(న్యాక్)  భవనంలో స్పెషల్ ఆఫీసర్  జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగింది. ఇందులో ఇన్ ఫ్రాస్ర్టక్చర్, సిటీ జన్ సర్వీసులు, పొల్యూషన్ కంట్రోల్ తో పాటు 15 ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా కమిషనర్, జోనల్ అధికారులు, హెచ్ఓడీల కోసం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనాలన్న ప్రపోజల్స్​కు ఆమోదం తెలిపారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 4-లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

లింగంపల్లి, కొండాపూర్, భౌరంపేట, దూలపల్లి వార్డుల్లో రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు అనుమతినిచ్చారు. ప్రగతి నగర్​లోని దాశరథి కృష్ణమాచార్యుల పార్కును రామోజీ ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్  కింద అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపారు. శేరిలింగంపల్లిలోని కుడికుంట చెరువు నిర్వహణ బాధ్యతలను కేఎల్ పీసీ స్వచ్ఛంద సంస్థకి అప్పగించేందుకు ఆమోదించారు.

కేపీహెచ్ బీ 6వ ఫేజ్‌లో ప్రజారోగ్య సేవల కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీకి స్థలం కేటాయించేందుకు ఆమోదించారు. నిజాంపేటలో వరద నీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇటీవల వీలీనమైన మున్సిపాలిటీల్లోని శానిటేషన్ కార్మికులకు  జీహెచ్ఎంసీ సిబ్బందితో సమానంగా  పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.