కొత్త ఓపెన్ కాస్ట్ గనుల్లో.. ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి

కొత్త ఓపెన్ కాస్ట్ గనుల్లో.. ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి
  • సింగరేణి సీఎండీ శ్రీధర్

హైదరాబాద్‌, వెలుగు: సింగరేణి సంస్థ చేపట్టిన 3 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈఏడాది డిసెంబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సీఎండీ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో కొత్త గనులపై హైలెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడారు. సింగరేణి సంస్థ ఈఏడాది కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న వీకే కోల్ మైన్ (కొత్తగూడెం), రొంపేడు ఓపెన్ కాస్ట్ గని (ఇల్లందు), గోలేటి ఓపెన్ కాస్ట్ గని (బెల్లంపల్లి)కి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న అటవీశాఖ అనుమతులను వెంటనే పొందేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నుంచి ఈ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. 

వీకే కోల్ మైన్ నుంచి ఈఏడాది కనీసం 7లక్షల టన్నులు, జీకే ఓపెన్ కాస్ట్ నుంచి 3లక్షల టన్నులు, గోలేటి ఓపెన్ కాస్ట్ నుంచి 5 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలన్నారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్​కు సంబంధించి అన్ని అనుమతులు వచ్చాయని, సెప్టెంబర్ కల్లా ప్రొడక్షన్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాదికి సింగరేణి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలంటే కొత్త గనుల నుంచి ప్రొడక్షన్ పెరగడం తప్పనిసరి అని సూచించారు.