కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ మనోళ్లదే..బీహెచ్ఈఎల్,  ఐఐసీటీతో పాటు ఇతర సంస్థల కృషి :  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ మనోళ్లదే..బీహెచ్ఈఎల్,  ఐఐసీటీతో పాటు ఇతర సంస్థల కృషి :  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • దీంతో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
  • కేంద్ర ప్రభుత్వం రూ.46 వేల కోట్లు కేటాయించిందని వెల్లడి
  • హైదరాబాద్‌‌లో నిర్వహించిన రోడ్ షోలో కేంద్ర మంత్రి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లోకల్ బొగ్గుతో గ్యాసిఫికేషన్ టెక్నాలజీ కృషి మన రాష్ట్ర శాస్త్రవేత్తలదేనని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడి బీహెచ్ఈఎల్, ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)తో పాటు అనేక పరిశోధనా సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన 'కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షో'లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని సింగరేణి వద్ద అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు.

కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తయ్యే మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్ తదితర ఉత్పత్తులకు ఫార్మా రాజధాని అయిన హైదరాబాద్ అద్భుతమైన మార్కెట్ అని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ అనేది గొప్ప వ్యాపార అవకాశంతో పాటు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వివరించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత్ అవతరించిందని, దేశంలో అద్భుతమైన సెమీ కండక్టర్ వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.

స్టార్టప్ వ్యవస్థలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందని, దేశంలో 1.6 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌‌లు, 100కు పైగా యూనికార్న్‌‌లు ఉన్నాయని వివరించారు. రక్షణ రంగ ఎగుమతులు 2014లో రూ.686 కోట్లు ఉండగా, 2026 నాటికి అవి రూ.38,424 కోట్లకు చేరాయని ప్రకటించారు. గత 12 ఏళ్లలో భారత్‌‌లో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రపంచ దేశాల పరిశ్రమలు భారతదేశాన్ని కేవలం ఒక పెద్ద మార్కెట్‌‌గానే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి దేశాల సరసన చేర్చాయని వ్యాఖ్యానించారు.

530 గిగావాట్లకు చేరిన విద్యుత్ కెపాసిటీ..

దేశంలో మొత్తం ఇన్‌‌స్టాల్డ్ విద్యుత్​కెపాసిటీ 530 గిగావాట్లకు చేరిందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. దేశ పోర్ట్ కెపాసిటీ మూడు రెట్లకు పైగా పెరిగి ఏటా 2,760 మిలియన్ టన్నులకు చేరుకుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌కు ప్రాధాన్యం ఇస్తూ అనుమతుల్లో దాదాపు 10 వేల ఇబ్బందులను సరళీకరించామని చెప్పారు.  రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌‌వర్క్‌‌లలో ఒకటి మన దేశంలోనే ఉందన్నారు. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ దాదాపు 100 శాతానికి చేరుకుందని, ఇన్‌‌స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో, సౌర విద్యుత్ వృద్ధిలో రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ అనేది కేవలం బొగ్గు రంగానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని.. వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్, అంతర్జాతీయ ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల్లో దేశం మహోన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమయ్యే మూలస్తంభమని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో స‌‌కాలంలో ‘ఉపాధి హామీ’ అమ‌‌లుకు కృషి

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా జులై నెల నుంచి అమలులోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ స్కీమ్ (గ్రామీణ్) పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో సజావుగా అమలు చేయడానికి  కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిష‌‌న్‌‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప‌‌థ‌‌కానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో   గురువారం ఢిల్లీలో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. ఈ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ. 3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారన్నారు. 

 కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్‌‌కు రూ.46 వేల కోట్లు..

దేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.46 వేల కోట్లు ప్రకటించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని 72 శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోందన్నారు. సిమెంట్, స్టీల్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా జరుగుతుండగా.. కోల్ గ్యాసిఫికేషన్‌‌ను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇటీవల ఆమోదం పొందిన రూ.37,500 కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ తో ఈ ప్రాజెక్టులు మరింత వేగంగా ముందుకు సాగుతాయన్నారు.

 కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఫర్టిలైజర్లు, కెమికల్స్, హైడ్రోజన్, శుద్ధమైన ఇంధనం ఉత్పత్తి చేసే అవకాశం లభిస్తుందన్నారు. స్టీలు ఉత్పత్తిలోనే కాకుండా డొమెస్టిక్, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే సింథటిక్ నేచురల్ గ్యాస్ తయారీలోనూ ఇది కీలకమన్నారు. డీజిల్, పెట్రోల్, జెట్ ఫుయెల్ వంటి వాటి ఉత్పత్తిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. చైనా, దక్షిణాఫ్రికా, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.