సినిమా స్టైల్‌లో ఛేజ్: రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్న నేవీ సిబ్బంది

సినిమా స్టైల్‌లో ఛేజ్: రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్న నేవీ సిబ్బంది

భారత సముద్ర మార్గంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ నౌక నుండి రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఇండియన్ నేవీ అధికారులు.  ఆ డ్రగ్స్ ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల్ని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇండియన్ కోస్ట్ భద్రతా దళాలు నిన్న రాత్రి  పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అండమాన్ నుండి 125 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ఓ అనుమానాస్పద నౌకను కనుగొన్నారు.  ఆ నౌక భారతదేశానికి చెందిన నౌక కాదని తెలుసుకొని.. వెంటనే  కోస్ట్ గార్డ్ షిప్ అరుణ ఆసిఫ్ అలీ కు ఈ నౌకకు సంబంధించి నావికా దళ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆ నౌక భారత సరిహద్దును దాటడంతో అధికారులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఆ పడవను ఆపే ప్రయత్నం చేశారు.

తమను ఎక్కడ పట్టుకుంటారోనన్న భయంతో ఆ పడవలోని వ్యక్తులు వారి వెంట తెచ్చుకున్న డ్రగ్స్ ని  నీటిలో పడేయబోయారు. అధికారులు వెంటనే ఆ పడవను చుట్టుముట్టి… అందులో ఉన్న ఆరుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. ఆ నౌక మయన్మార్ కు చెందినదని, అక్రమంగా మత్తు పదార్ధాలను రవాణా చేస్తున్నారని అధికారులు తెలుసుకున్నారు.

మయన్మార్ నుండి పడవ ద్వారా సుమారు 125 పొట్లాల మాదకద్రవ్యాలను దేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలిందని, వీటి మొత్తం విలువ సుమారు 150 కోట్ల రూపాయలు అని కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయి.