మరో ఉద్యమానికి సిద్ధమైన కాక్రోచ్ పార్టీ.. ఈ సారి సీఎం పోస్ట్‎కే ఎసరు..?

మరో ఉద్యమానికి సిద్ధమైన కాక్రోచ్ పార్టీ.. ఈ సారి సీఎం పోస్ట్‎కే ఎసరు..?

రాంచీ: నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరో ఉద్యమానికి సిద్ధమైంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) పరీక్షలలో జరిగిన అవకతవకలపై పోరాటానికి సీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలలో అవకతవకలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడాను. పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులందరికీ కాక్రోచ్ జనతా పార్టీ అండగా నిలుస్తుంది. విద్యార్థుల డిమాండ్లకు సీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది’’ అని దీప్కే పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే..?

ఇటీవల జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన పలు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. 

గత ఆరు రోజులుగా రాష్ట్ర రాజధాని రాంచీ వేదికగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నియామక పరీక్షల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో జేపీఎస్సీ చైర్మన్ లాల్బియాక్ట్లుంగా కియాంగ్టే ఇప్పటికే తన పదవికి రాజీనామా చేపట్టారు. అయితే, పరీక్షల్లో అవకతవకలకు సీఎం హేమంత్ సోరెన్‌ బాధ్యుడని.. ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర దర్యాప్తు సంస్థల చేత కాకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

సీఐడీ విచారణకు సీఎం ఆదేశం:

రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోన్న ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై సీఎం హేమంత్ సొరెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీఐడీ ముమ్మరంగా దర్యా్ప్తు చేస్తోంది. ఇప్పటివరకు మాజీ డిప్యూటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ప్రైవేట్ ఏజెన్సీ మార్కెటింగ్ మేనేజర్ అభయ్ తివారీతో సహా 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సీజేపీ ఎంట్రీతో టెన్షన్..!

జార్ఖండ్ రాష్ట్ర పరీక్షలలో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు సోమవారం (ఆగస్ట్ 3) ఆరో రోజుకు చేరుకున్నాయి. పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‎లో పరీక్షల అవకతవకలపై ఉద్యమిస్తోన్న విద్యార్థులకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతు ప్రకటించింది. 

►ALSO READ | స్కాలర్ షిష్, ఎడ్యుకేషన్ లోన్‎తోనే చదువుకున్న: విదేశీ విద్య వివాదంపై అభిజిత్ క్లారిటీ

విద్యార్థులకు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనల్లోకి సీజేపీ ఎంట్రీ ఇవ్వనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఉద్యమించిన సీజేపీ.. తమ డిమాండ్ నెగ్గే వరకు వెనక్కి తగ్గలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైన ధైర్యంగా పోరాడింది. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పాటు తమ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే ఆందోళన విరమించింది. అదే విధంగా జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తే మాత్రం ఆయన పదవికి ఎసరు రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.