న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) గురించే చర్చ నడుస్తోంది. ప్రారంభించిన కేవలం ఒక్క వారంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 20 మిలియన్లకు పైగా (2 కోట్లు) ఫాలోవర్లను సంపాదించుకుని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీని కూడా ఇది వెనక్కి నెట్టేసింది. అయితే, ఈ తిరుగులేని పాపులారిటీతోపాటు ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదాలు, ఆరోపణలు ముసురుకుంటున్నాయి.
ఈ పార్టీకి వస్తున్న ఫాలోవర్లలో ఎక్కువ భాగం పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందినవారేనని బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీ తేజీందర్ బగ్గా, పార్టీ ప్రతినిధి ప్రీతి గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. తేజీందర్ బగ్గా ఒక డేటాను షేర్ చేస్తూ.. కాక్రోచ్ పార్టీ ఫాలోవర్లలో పాకిస్తాన్ (49%), అమెరికా (14%), బంగ్లాదేశ్ (14%) ప్రజలు ఉన్నారని, ఇండియానుంచి కేవలం 9% మందే ఉన్నారని పేర్కొన్నారు.
‘‘మీ అతిపెద్ద ఫ్యాన్ బేస్ శత్రు దేశంలో ఉన్నప్పుడు, మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో ఇకనైనా దాచడం ఆపండి”అంటూ ప్రీతి గాంధీ ఎక్స్ (ట్విట్టర్)లో విమర్శలు గుప్పించారు. అయితే, ఈ ఆరోపణలను అభిజీత్ దీప్కే గట్టిగా తిప్పికొట్టారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడిగా తనకున్న అధికారిక అనలిటిక్స్ డేటాను ఆయన స్క్రీన్‌షాట్ ద్వారా షేర్ చేశారు.
ఆ డేటా ప్రకారం సీజేపీ ఫాలోవర్లలో 94% మంది భారతీయులేనని, అమెరికా నుంచి 1%, బ్రిటన్ నుంచి 0.7% మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. ‘‘ఖాతాను హ్యాక్ చేయాలని చూసి విఫలమవడంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 94% మంది భారతీయ యువతను మీరు పాకిస్తానీలు అని ఎలా పిలుస్తారు?’’ అని దీప్కే ప్రశ్నించారు. దీనిపై మెటా, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
