ఏడాదిలోపే ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులు.. నాలుగేండ్లయినా పూర్తికాని కలెక్టరేట్లు

ఏడాదిలోపే ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులు.. నాలుగేండ్లయినా పూర్తికాని కలెక్టరేట్లు

హైదరాబాద్, వెలుగు: కొత్త కలెక్టరేట్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించిన ఏడాదిలోపే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను పూర్తి చేసిన సర్కార్.. నాలుగేండ్లయినా కలెక్టరేట్ల నిర్మాణాలను పూర్తి చేయడం లేదు. 2016 నవంబర్​లో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల నిర్మాణాలను ప్రారంభించగా.. 2017 జూన్, జులై కల్లా నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ 2017లో నిర్మాణాలు ప్రారంభమైన కలెక్టరేట్ల బిల్డింగుల్లో సగమన్నా పూర్తి కాలేదు. 2017 అక్టోబర్ 11న సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ బిల్డింగుల పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మరో 26 జిల్లాల్లోనూ స్థలాలు గుర్తించి, కలెక్టరేట్లు నిర్మించాలని అప్పుడే ఆదేశించారు. ఆ తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు కావడంతో.. కొత్త కలెక్టరేట్ బిల్డింగుల సంఖ్య 29కి చేరింది. ఇప్పటి వరకు సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, హనుమకొండ జిల్లాల్లో మాత్రమే కలెక్టరేట్ బిల్డింగుల పనులు పూర్తయ్యాయి. ములుగు, నారాయణపేట, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇంకా పనులే ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, కొత్తగూడెం, గద్వాల, మంచిర్యాల, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో పనులు కొనసాగుతున్నాయి. జనగాం, వనపర్తి, మహబూబ్​నగర్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజ్​గిరి జిల్లాల్లో 90% పనులు పూర్తయినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ బిల్డింగుల్లో ఫర్నీచర్‌‌ పనులు, అంతర్గత రోడ్లు తదితర పనులు జరుగుతున్నాయి.

జిల్లా కేంద్రానికి దూరంగా...

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలు కూడా అందుకేనని కేసీఆర్ పలుసార్లు ప్రకటించారు. కానీ, కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి రాకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాలు లేవు. ఉదాహరణకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో హైవేకు దగ్గర ఒక పాత బిల్డింగులో కలెక్టరేట్ ఆఫీసు కొనసాగుతోంది. ఊర్ల నుంచి భువనగిరి వరకు వస్తున్న జనం.. అక్కడి నుంచి కలెక్టరేట్​కు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భూపాలపల్లి జిల్లాలో కలెక్టరేట్ బిల్డింగు నిర్మాణం ఇంకా స్లాబుల దశలోనే ఉంది.  ములుగు కలెక్టరేట్‌‌కు స్థలాన్ని గుర్తించినా ఫారెస్ట్,  రెవెన్యూ డిపార్ట్​మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.