గాంధీ కన్న కలలను కేసీఆర్ నిజం చేస్తున్నారు

గాంధీ కన్న కలలను కేసీఆర్ నిజం చేస్తున్నారు

కరీంనగర్: ‘‘రైతులు ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులు ముందడుగు వేయాలి. నూనె గింజల పంటలతోపాటు వాణిజ్య పంటలు సాగు చేయాలి. తప్పనిసరైతే సన్నాల సాగుకు పూనుకోవాలి..’’ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్ లో 20 లక్షల   నిధులతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. 
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్రం విదానాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాజ్యాంగం ప్రకారం పంటల సేకరణ, మద్దతు ధర, నిల్వ, మార్కెటింగ్ కేంద్రం బాధ్యతేనని గుర్తు చేశారు. కరెంటు, నీరు, పెట్టుబడి సాయం రాష్ట్రాల బాధ్యత అని ఆయన తెలిపారు. నిల్వల సాకుతో కేంద్రం ధాన్యం కొనుగోలు బాధ్యత నుండి తప్పుకోవాలనుకుంటోందని ఆయన ఆరోపించారు. ఏదేమైనా ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులు ముందడుగు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతుల సమస్యల్ని వ్యవసాయ శాస్త్రజ్ణులు, అధికారులతో కలిసి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ స్వరాజ్యం కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోందన్నారు.

బియ్యం నిల్వల సాకుతో మన రైతాంగానికి తీవ్రంగా నష్టం చేకూర్చే దిశగా కేంద్ర విధానాలు ఉన్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాబోయే వానాకాలం పంట దొడ్డు వడ్లు  తీసుకోవడానికి సీఎం కేసీఆర్ గారు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి సాధించారని తెలిపారు.కానీ వచ్చే యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో బాయిల్డ్ రైస్  సేకరించబోమని ఎప్.సి.ఐ స్పష్టం చేసిందని ఆయన వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు పక్కాభవనాలతో పాటు పల్లె పకృతి వనాలు, రైతు చర్చావేదికలు, వైకుంఠ ధామాలు నిర్మిస్తూ పల్లెల రూపురేఖల్ని సంపూర్ణంగా మార్చివేశామని, గాందీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేసి చూపిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.