ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భారత్పై తీవ్ర ప్రభావం చూపింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న చమురు సంక్షోభం కారణంగా.. మరోసారి కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై 993 రూపాయలు పెరిగింది. ఈ పెంపు తర్వాత.. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,071వేలకు చేరింది. పెంచిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
LPG సిలిండర్ల ధరల్లో మార్పులు లేవని కేంద్రం ప్రకటించడంతో సామాన్య ప్రజలు హమ్మయ్య అనుకున్నారు. 2026 జనవరి 1 నుంచి ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఇది ఆరో సారి కావడం గమనార్హం. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది.
వాణిజ్య ఎల్‌పిజి (19 కేజీలు) ధరను సగటున రూ. 993 పెరిగింది. ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధరలు గతంలో రూ. 2,078.50 ఉండగా, ఇప్పుడు అవి రూ. 3,071.50కి చేరాయి. ముంబైలో వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 2,031 నుంచి రూ. 3,024కు పెరిగింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను మూడుసార్లు పెంచడం గమనార్హం. మొదట మార్చిలో రూ. 144 పెంచగా, ఆ తర్వాత ఏప్రిల్ 1న దాదాపు రూ. 200 మేర మరోసారి పెంచారు.
పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు లేదు
పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంధన ధరల్లో ఎలాంటి పెంపు లేదు. దేశీయ విమానయాన సంస్థలకు (షెడ్యూల్డ్ కార్యకలాపాలు) ఊరట ఇస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలలో కూడా ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయకపోవడం గమనార్హం.

