రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థులకు తరగతులు ఉంటే.. మరో యూనివర్సిటీ లో విద్యార్థులకు సెలవులుండేవి. పరీక్షల నిర్వహణ కూడా ఒకే సారి ఉండేవి కావు. ఈ విధానంతో విద్యార్థుల్లో, అధికారుల్లో కొంత గందరగోళం ఉండేది. ఇకపై ఈ విధానానికి అధికారులు.. స్వస్తిపలకనున్నారు. నూతన షెడ్యూల్ ప్రకారం అన్ని వర్సిటీల్లో ఒకే సారి తరగతులు ప్రారంభమై ఒకేసారి పరీక్షలు, సెలవుల విధానాన్ని పాటించనున్నాయి. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు ఇక కామన్ పీజీ క్యాలెండర్ విధానాన్ని పాటించనున్నాయి. 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచే ఇది అమల్లోకి రానుంది. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఆరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు..అన్ని వర్సిటీల్లో ఒకేసారి తరగతులు, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూ ల్‌ను రూపొందించనున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి జనవరి నుంచి పీజీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఆరు వర్సిటీల్లో ప్రవేశాలకు కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ నిర్వహిస్తున్నందున..క్లాసులు,ఎగ్జామ్స్ ను కూడా ఒకేసారి నిర్వహిస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
