కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట.. మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే!

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట.. మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే!

Commonwealth Games 2026: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2026)లో భారత క్రీడా బృందం అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. జులై 27 (సోమవారం) ఒక్క రోజే ఏకంగా 6 పతకాలను కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఈ టోర్నీలో ముఖ్యంగా వెయిట్‌లిఫ్టింగ్ విభాగం ఇండియాకు అత్యంత విజయవంతమైన క్రీడగా నిలిచి ఇప్పటిదాకా ఏకంగా 6 పతకాలను అందించింది.

స్వర్ణ పతక విజేతలు: 

* షర్మిలా ధంకార్ (పారా అథ్లెటిక్స్): మహిళల షాట్‌పుట్ F57 ఫైనల్లో పసిడి పతకాన్ని గెలుచుకుంది. కామన్‌వెల్త్ గేమ్స్‌ పారా అథ్లెటిక్స్‌లో భారతదేశం తరఫున స్వర్ణం సాధించిన మొట్టమొదటి పారా-అథ్లెట్‌గా షర్మిల రికార్డు సృష్టించింది.

* మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్): మహిళల 48 కేజీల విభాగంలో మొత్తం 190 కేజీల (85 కేజీల స్నాచ్ + 105 కేజీల క్లీన్ & జెర్క్) బరువును ఎత్తి రికార్డు స్కోరుతో వరుసగా మూడోసారి కామన్‌వెల్త్ (హ్యాట్రిక్) గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని అందుకుంది. 

రజత పతక విజేతలు: 

* రిషికాంత్ సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్): పురుషుల 60 కేజీల విభాగంలో స్నాచ్‌లో 121 కేజీల గేమ్స్ రికార్డుతో రజతం సాధించి, 2026 గేమ్స్‌లో భారత్‌కు మొదటి ఏబుల్డ్-బాడీడ్ (able-bodied) పతకాన్ని అందించాడు.

* ముత్తుపాండి రాజా (వెయిట్‌లిఫ్టింగ్): పురుషుల 65 కేజీల విభాగంలో మొత్తం 286 కేజీల బరువును ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

* జ్ఞానేశ్వరి యాదవ్ (వెయిట్‌లిఫ్టింగ్): మహిళల 53 కేజీల విభాగంలో తీవ్ర పోటీని తట్టుకుని మొత్తం 199 కేజీల బరువు ఎత్తి రజత పతకం సాధించింది. 

* వల్లూరి అజయ్ బాబు (వెయిట్‌లిఫ్టింగ్): పురుషుల 79 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు.  

* సర్వేష్ కుషారే (అథ్లెటిక్స్): పురుషుల హైజంప్ విభాగంలో రజత పతకం సాధించి, కామన్‌వెల్త్ గేమ్స్ హైజంప్‌లో సిల్వర్ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.

కాంస్య పతక విజేతలు: 

* ఝండు కుమార్ (పారా పవర్ లిఫ్టింగ్): పురుషుల హెవీవెయిట్ విభాగంలో 190 కేజీల బరువును ఎత్తి కాంస్యం సాధించడమే కాకుండా, గ్లాస్గో గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.

* బింధ్యారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్): మహిళల 58 కేజీల విభాగంలో మొత్తం 199 కేజీలు ఎత్తి తన కెరీర్‌లో రెండో కామన్‌వెల్త్ పతకాన్ని సొంతం చేసుకుంది.

* శిల్పా కె. షైలా (పారా అథ్లెటిక్స్): మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో భారత బృందం చేసిన అధికారిక అప్పీల్ సఫలం కావడంతో శిల్పకు కాంస్య పతకం దక్కింది.