
- హెచ్ఎన్ఎస్ చికిత్సాలయ్ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ట్యాంక్ బండ్, వెలుగు: సమాజ అభివృద్ధి ప్రతీ పౌరుని బాధ్యత అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరి శక్తి మేరకు వారు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. హర్యానా నాగరిక్ సంఘ్(హెచ్ఎన్ఎస్ ) పేదలకు కనీస చార్జీలతో వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, సిక్ విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ఎన్ఎస్ చికిత్సాలయ్ ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
అనంతరం చికిత్సాలయ్ చైర్మన్ అంజనీకుమార్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ.. సమాజం శక్తివంతంగా ఉంటేనే ప్రజలు శక్తివంతంగా ఉంటారని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, భాష అనే బేధాలు లేకుండా ప్రజలందరికీ వైద్య సేవలందించాలని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని, ఇందుకోసం రాజ్ భవన్ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, హెచ్ఎన్ఎస్ అధ్యక్షుడు పదమ్ జైన్, రామ్ గోయల్, పురుషోత్తం అగర్వాల్, బి.నర్మదా మల్లికార్జున్, దీపక్, సుశీల్ అగర్వాల్, సందీప్ మిట్టల్, నారాయణ చౌదరి, రాజేందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.