మణుగూరు రేసు నుంచి జెన్కో వైదొలిగేనా?

మణుగూరు రేసు నుంచి జెన్కో వైదొలిగేనా?
  • మణుగూరు రేసు నుంచి జెన్​కో వైదొలిగేనా?
  • కేంద్రం నిర్వహిస్తున్న బొగ్గు వేలంలో మణుగూరు​ మైన్ ​కోసం సింగరేణి, జెన్​కో టెండర్లు
  • జెన్​కో తప్పుకుంటే సింగరేణికే గని దక్కుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • జెన్​కో స్వచ్ఛందంగా తప్పుకోవాలని సింగరేణి కార్మిక సంఘాల డిమాండ్​ 
  • ఇప్పటికే జెన్​కోకు కేటాయించిన తాడిచర్ల బొగ్గు బ్లాక్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించిందనే విమర్శలు 
  • జెన్​కో నిర్ణయంపై నెలకొన్న ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు:  మణుగూరులోనీ పీకేఓసీ డీప్ సైడ్ బొగ్గు బ్లాకు  కోసం సింగరేణి, జెన్​కో మధ్య పోటీ నెలకొన్నది. కేంద్రం నిర్వహిస్తున్న బొగ్గు వేలంలో రాష్ట్రం నుంచి ఈ రెండు ప్రభుత్వరంగలు సంస్థలు టెండర్లు వేయడం ఆసక్తి రేపుతున్నది. పోటీలో ఆ రెండు సంస్థలే ఉండడం.. బొగ్గు గని సైతం రాష్ట్రానికి చెందినదే కావడంతో జెన్​కో తప్పుకుంటే సింగరేణికే ఈ గని దక్కుతుందని ఇటీవల కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఇందుకు సీఎం రేవంత్​రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. అటు కార్మికుల భవిష్యత్​ దృష్ట్యా జెన్​కో స్వచ్ఛందంగా తప్పుకోవాలని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.

బొగ్గు గనుల తవ్వకాల్లో ఏమాత్రం  అనుభవం లేని జెన్​కో సంస్థకు ఇప్పటికే తాడిచెర్ల–1  బ్లాక్​ను అప్పగించారని, కానీ దానిని 25 ఏళ్ల అగ్రిమెంట్​తో ఓ ప్రైవేట్​ సంస్థకు కట్టబెట్టిందని, దీని వల్ల ఆ సంస్థకు, కార్మికులకు ఎలాంటి లాభం లేకుండా పోయిందని విమర్శిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ మణుగూరు బ్లాక్​ దక్కినా అదే పరిస్థితి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో మూడు రోజుల్లో టెండర్లు ఫైనల్​ కానున్న నేపథ్యంలో జెన్​కో నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.

రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే కానీ.. 

రాష్ట్రానికి చెందిన సింగరేణి, జెన్​కో రెండు ప్రభుత్వ రంగ సంస్థలే. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా, 49 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉండగా జెన్​కోలో మొత్తం వంద శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. అటు సింగరేణికి బొగ్గు తవ్వకాల్లో 130 ఏళ్ల అనుభవం ఉన్నది. ఈ సంస్థను నమ్ముకొని 40 వేల మందికి పైగా సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారు. జెన్​కో సంస్థకు థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తి రంగంలో విశేష అనుభవం ఉన్నది. దశాబ్దాల కాలంగా సింగరేణి సంస్థే జెన్​కో పవర్​ ప్లాంట్లకు బొగ్గు సప్లయ్​ చేస్తున్నది.

ఈ రెండు సంస్థలకు బొగ్గు కామన్​ పాయింట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎంఎండీఆర్ చట్టం-2015 కారణంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్​ జెన్​కో సంస్థకు దక్కింది. కానీ బొగ్గు తవ్వకాల్లో ఎలాంటి అనుభవం లేని జెన్​కో సంస్థ మైనింగ్, సప్లయ్, ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​ బాధ్యతల కోసం అప్పట్లో ఓపెన్​ టెండర్లు పిలవగా ఏఎంఆర్​ అనే ప్రైవేట్​ సంస్థ దక్కించుకున్నది. దీని వల్ల జెన్​కోకు బొగ్గు బ్లాక్​ కట్టబెట్టిన లక్ష్యం నెరవేరకుండా పోయిందని, ఈ మేరకు సింగరేణికి నష్టం జరిగిందనే వాదనలున్నాయి. 

మణుగూరు మైన్​లో 120 మిలియన్ ​టన్నుల బొగ్గు నిల్వలు

కేంద్రం వేలం నిర్వహిస్తున్న మణుగూరు పీకేఓసీ 2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకులో 120 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఎంతో నాణ్యతతో కూడిన జీ8 గ్రేడ్​ బొగ్గు అధికంగా ఉన్నది. ఏటా 4 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా సుమారు 30 ఏళ్ల పాటు ఈ బొగ్గు బ్లాక్​ నిర్వహించుకోవచ్చు. ఈ బ్లాక్​కు అతి దగ్గరలో ఉన్న ప్రస్తుతం మణుగూరు ఓపెన్​ కాస్ట్​ మైన్​ను సింగరేణి సంస్థ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 1,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2031 వరకు మాత్రమే కొనసాగుతుంది. దీనికి ఆనుకుని ఉన్న కొత్తగా వేలం నిర్వహించే ‘డీప్ సైడ్’ బొగ్గు బ్లాక్ సింగరేణికి లభిస్తే మణుగూరు ఏరియాలో  30 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి జరగడంతోపాటు కార్మికుల ఉపాధి భద్రత లభిస్తుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. 

ఇప్పటికే రెండు బ్లాక్​లు కోల్పోయిన సింగరేణి

కేంద్రం బొగ్గు గనుల వేలం వల్ల  రాష్ట్రంలోని రెండు మైనింగ్​ ప్రాజెక్టులను సింగరేణి సంస్థ ఇప్పటికే కోల్పోయింది. బీఆర్ఎస్​ సర్కారు తీరుతో 2022లో కోయగూడెం--3, సత్తుపల్లి- -3 బొగ్గు బ్లాకులను అరబిందో, అవంతిక అనే ప్రైవేట్​సంస్థలు దక్కించుకున్నాయి. నాలుగేళ్లు గడిచినా ఆ ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీనివల్ల ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల భవిష్యత్తు, అక్కడి వేలాది సింగరేణి కార్మిక కుటుంబాల ఉద్యోగ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతున్నది. 

చట్ట ప్రకారం నడుచుకుంటాం..

రాష్ట్రంలోని జెన్​కో థర్మల్​విద్యుత్​ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు అవసరం ఉన్నది. అందుకే మణుగూరు డీప్​ సైడ్​ బొగ్గు బ్లాక్​ వేలంలో జెన్​కో సంస్థ పాల్గొన్నది. చట్ట ప్రకారమే టెండర్లు వేసినం. జెన్​కో సంస్థ వేలంలో పాల్గొనకపోతే ఒకటే టెండర్​ దాఖలు అయ్యేది. అప్పుడు కేంద్రం టెండర్లు రద్దు చేసేది. జెన్​కో సంస్థ చట్ట ప్రకారం ముందుకుపోతుంది.- హరీశ్​, జెన్​కో సీఎండీ, హైదరాబాద్​