జగిత్యాల, వెలుగు: లంచం ఇచ్చినా తన పని చేయలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కరీంనగర్‌కు చెందిన వంకాయల మహేశ్వర్ జిల్లా సహకార కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కోడూరు హరీశ్ తన పని చేస్తానని చెప్పి రూ.11,100 లంచంగా తీసుకున్నాడని చెప్పారు. ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించినప్పటికీ పని చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డబ్బులు తీసుకుని పని చేయకపోగా, పని చేయాలని అడిగితే కులం పేరుతో దూషించాడని మహేశ్వర్ ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వ్యవహారం కలకలం రేపింది. అయితే డబ్బులు డిమాండ్ చేసినప్పుడే ఫిర్యాదు చేయకుండా, లంచం ఇచ్చి, ఆ తర్వాత పని కాలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
