ఇక సమగ్రంగా భూ సర్వే.. ప్రతి ఇంచూ కొలుస్తం

ఇక సమగ్రంగా భూ సర్వే.. ప్రతి ఇంచూ కొలుస్తం
  • పోడు భూములకు హక్కులు కల్పి స్తం .. సాదాబైనామాలు, 58, 59 జీవోలకు మరో చాన్స్‌‌
  • ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనేతర రైతులకు రైతుబంధు ఇస్తం
  • ఇంకా 87 పాత చట్టాలున్నయ్ .. మరో 3 రద్దు చేయాలనుకుంటు న్నం
  • నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు మెరూన్ కలర్ పాస్​బుక్​లు ఇస్తామని వెల్లడి
  • కొత్త రెవెన్యూ బిల్లు, వీఆర్వోల రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • కొత్త రెవెన్యూ బిల్లు, వీఆర్వోల రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్‌‌, వెలుగు: కొత్త రెవెన్యూ యాక్ట్‌‌తో ఇకపై రాష్ట్రంలో భూముల కిరికిరి ఉండబోదని సీఎం కేసీఆర్‌‌  అన్నారు. రాష్ట్రంలోని భూములను ప్రతి ఇంచూ కొలుస్తామని చెప్పారు. డిజిటల్‌‌ సర్వే చేయించి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన సరిహద్దులతో పాస్‌‌బుక్‌‌లు ఇస్తామని చెప్పారు. వీలైనంత తొందరగా సమగ్ర సర్వే జరుగుతదని, త్వరలోనే  టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామని ప్రకటించారు. ‘‘వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తే ప్రజలు సెలబ్రేట్‌‌ చేసుకుంటున్నరు. పటాకులు కాలుస్తున్నరు. స్వీట్లు పంచుతున్నరు.. పీడ విరగడైందని అంటున్నరు. కొందరైతే నిజమేనా అని గిచ్చి చూసుకుంటున్నరు’’ అని కేసీఆర్​ పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ యాక్ట్‌‌పై శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగి ప్రశ్నలకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గత ప్రభుత్వాలు చేసిన భూ పంపిణీ తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. ఆర్వోఎఫ్‌‌ఆర్‌‌ భూములకు ధరణి పోర్టల్‌‌లో ప్రత్యేక కాలమ్‌‌ పెడుతామని, పోర్టల్​ను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. మరో మూడు చట్టాలను రద్దు చేయాలనుకుంటున్నామని,  మంచిచెడులపై స్టడీ చేస్తున్నామని ఆయన అన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనేతర రైతులకు రైతుబంధు ఇస్తామని చెప్పారు. ‘‘ఓట్లు వస్తున్నాయంటే మేళాలు పెట్టుడు సర్టిఫికెట్లు ఇచ్చుడు.. ఒకర్ని మించి ఒకరు సర్టిఫికెట్లు ఇచ్చుడు. మఠంపల్లిలో  1500 ఎకరాలు ఉంటే 9 వేల ఎకరాలకు సర్టిఫికెట్‌లు ఇచ్చిండ్రు. బాటలు లేకుండా, హద్దులు లేకుండా ఇచ్చిండ్రు. ఎట్లా పోవాలే హెలిక్యాప్టర్ల ఎగిరిపోవాల్నా.. ఇట్లా చేసే గందరగోళం చేసిండ్రు.. ఆన్‌ ద గ్రౌండ్‌  ఇంకా అవే తగాదాలు ఉన్నయ్​. తలక్కాయలు పలగ్గొట్టుకొని సస్తా ఉన్నరు..’’ అని సీఎం అన్నారు.

నిజమా అని ప్రజలు గిచ్చి చూసుకుంటున్నరు

గతంలో పహాణీలో 33 కాలమ్‌‌లు ఉండేవని సీఎం చెప్పారు. ‘‘భూమి శిస్తు వసూలు చేయడం కోసమే ఇవి పుట్టినయ్​. వీటిని ఆ జమానాలో సాలార్జంగ్‌‌  తెచ్చిండ్రు. తాకట్లు పెట్టటానికేనా ఈ కాలమ్‌‌లు. ఇప్పుడు రెవెన్యూ వసూలు లేదు. పైగా ప్రభుత్వమే ఇప్పుడు ఎకరానికి రూ.10 వేలు ఎదురు ఇస్తున్నది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తే ప్రజలు సెలబ్రేట్‌‌ చేస్తున్నరు. పటాకులు కాలుస్తున్నరు. స్వీట్లు పంచుతున్నరు.. పీడ విరగడైందని అంటున్నరు. కొందరైతే నిజమేనా అని గిచ్చి చూసుకుంటున్నరు’’ అని కేసీఆర్​ పేర్కొన్నారు. వారసత్వంగా వీఆర్‌‌ఏలు పనిచేస్తున్నారని, వారి కుటుంబ సభ్యులకు డిపెండెంట్‌‌ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తమకు తాముగా ఉద్యోగం చేస్తామన్న ఇస్తామని, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఇంచేందుకైనా ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలు ఎక్కువగా అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఒక పట్వారీ రికార్డులనే మార్చినట్టుగా తాను పత్రికల్లో వార్త చదివానని చెప్పారు. ‘‘ఆ వార్తను చూసి మేం నవ్వినవ్వి సచ్చినం. ఇలాంటి లొసుగులు ఉండొద్దు. కొద్దిగా కఠినం అనిపిస్తది.  వంద పర్సెంట్​ కఠినంగానే ఉండాలె’’ అని అన్నారు.

సీనియర్, రిటైర్డ్​ ఐఏఎస్‌లతో ట్రిబ్యునళ్లు

సీనియర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్​ చెప్పారు. అవి పర్మనెంట్ కాదని, కేవలం 16 వేల కేసులను పరిష్కరించేందుకే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘‘ట్రిబ్యునళ్లు 60, 70 రోజుల్లో కేసులను డిస్పోజ్​ చేసి పక్కకు వెళ్లిపోతయ్​. మన దగ్గర నిజాయితీపరులైన మంచి డైనమిక్​ ఐఏఎస్​ ఆఫీసర్లు ఉన్నరు. వీళ్లలో కొందరు రిటైర్డ్​ ఆఫీసర్లు ఉన్నరు. మనం ఐఏఎస్​ ఆఫీసర్లను నమ్మకపోతే ప్రపంచంలో ఎవరినీ నమ్మలేం. నిప్పుకణికల్లాంటి వారు ఉన్నరు. అట్లాంటి వాళ్లనే ట్రిబ్యునళ్లలో వేస్తం. ఇందులో అనుమానం లేదు’’ అని వివరించారు.

సాదా బైనామా, జీవో 58, 59కి ఇంకో చాన్స్‌‌

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం సాదా బైనామా పట్టాలకు డబ్బులు తీసుకుంటే తమ ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా పట్టాలిచ్చిందని సీఎం అన్నారు. మూడుసార్లు అవకాశం ఇచ్చి 6.18 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చామని చెప్పారు. అయినా ఎమ్మెల్యేలు ఇంకో చాన్స్‌‌ ఇవ్వాలని కోరుతున్నారని, మానవతా దృక్పథంతో 15 రోజులు టైం పెట్టి సాదాబైనామాలకు వన్​ టైం చాన్స్‌‌ ఇస్తామన్నారు. 58 జీవో ప్రకారం 100 గజాల వరకు ఫ్రీగా, 59 జీవో ప్రకారం 120 గజాల వరకు కొంచెం ఫీజుతో రెగ్యులరైజ్‌‌ చేశామని చెప్పారు. ఇలా 1,40,328 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఓనర్లు చేశామని, వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి అవకాశం ఇవ్వాలని సభ్యులు అడుగుతున్నారని, ఆ రెండు జీవోలను ఎక్స్‌‌స్టెండ్‌‌ చేసి పేదలకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. ఎంత టైం ఇవ్వాలి.. ఎలా చేయాలనేది కేబినెట్‌‌లో చర్చిస్తామని చెప్పారు.

ఎండోమెంట్‌‌, వక్ఫ్‌‌ భూములకు ఆటోలాక్‌‌

ఎండోమెంట్​, వక్ఫ్​ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలిస్తానని సీఎం చెప్పారు. ఆ భూములు ఇతరుల పేర్ల మీద బదిలీ కాకుండా, ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా శనివారం ఉదయమే ఆటోలాక్‌‌  చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని వక్ఫ్‌‌ భూములపై 1962 నుంచి 2003 వరకు సర్వే చేశారని, 62 గెజిట్‌‌లు ఇచ్చినా తేలిందేమీ లేదన్నారు. సమస్యలన్నీ అట్లానే ఉన్నాయని పేర్కొన్నారు. వక్ఫ్‌‌ భూములను కాకులు, గద్దల లెక్క కొట్టుకుపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో 77,538 ఎకరాల వక్ఫ్‌‌ భూములు ఉంటే.. వాటిలో 57 వేల ఎకరాలు  ఆక్రమించారని, 6 వేల ఎకరాల మీద కేసులు నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో దేవాదాయ భూములు 87,236 ఎకరాలు ఉంటే.. అందులో 22,545 ఎకరాలు ఆక్రమించారని, 26 వేల ఎకరాలు అర్చకుల ఆధీనంలో ఉన్నాయని, 19 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా లేవని వివరించారు. తాను 30 ఏళ్లుగా అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నానని అప్పటి నుంచి దేవాదాయ, వక్ఫ్‌‌ భూముల సమస్య ఇట్లానే ఉందని సీఎం చెప్పారు.

సర్కార్​ దగ్గర ఎక్కడున్నయ్​ భూములు పంచం

భూపంపిణీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ.. భూములు పంచేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర భూములు ఉంటే కదా పంచడానికి అని వ్యాఖ్యానించారు. దళిత కుటుంబాలకు అవకాశమున్న మేరకు మూడెకరాల భూమిని కొనిస్తున్నామని, ఎకరానికి రూ.7.50 లక్షలు పెట్టి కూడా కొనిచ్చామని చెప్పారు. కొనిచ్చుడు తప్ప ప్రభుత్వం దగ్గర భూములు లేవన్నారు. గత ప్రభుత్వాల హయాంలో.. ఉన్న భూములకు మించి ప్రజలకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ అయ్యాయని, వాటి పంచాయితీ తెంపితే మనమే గొప్పోళ్లమని చెప్పారు.

సమగ్ర భూ సర్వేతోనే సమస్యలు పరిష్కారం

సమగ్ర భూసర్వేకు దేశంలో చాలా కంపెనీలు, ప్రైవేట్​ ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయని, తలా ఓ జిల్లా ఇస్తే తొందరగా చేసి పెడతామంటున్నాయని సీఎం చెప్పారు.  సర్వే చేసిన తర్వాత పొజిషన్​ మీద ఎక్కువ ఉందో.. తక్కువ ఉందో తేలిపోతుందని, ఆ తర్వాత పట్టాలో ఎక్కువ, తక్కువ ఉంటే మార్చుకోవచ్చన్నారు. సమగ్ర భూసర్వేతోనే 99 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. సమగ్ర సర్వేలో అక్షాంశాలు, రేఖాంశాల వారీగా కోఆర్డినేట్స్​ ఇస్తారని, ఒక్కసారి హద్దులు నిర్ధారిస్తే భూగోళం ఉన్నంత వరకు మార్చడానికి వీలుండదన్నారు. వీలైనంత తొందరగా సర్వే జరుగుతదని, ప్రతి సర్వే నంబర్‌కు కో ఆర్డినేట్స్‌ ఇస్తామని వెల్లడించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామన్నారు. అసైన్డ్​ ల్యాండ్​ విషయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు పార్టీలకతీతంగా దళిత, గిరిజన నేతలు, ఎమ్మెల్యేలను పిలిచి సమావేశం పెట్టాలని సూచించానని ఆయన వివరించారు.

ఆర్వోఎఫ్ఆర్​ భూములకు ధరణిలో ప్రత్యేక కాలమ్​

అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న అడవి బిడ్డలకు అన్యాయం చేయబోమని సీఎం అన్నారు. అడవులపై ఎక్కువ అజమాయిషీ సెంట్రల్‌ గవర్నమెంట్‌ పరిధిలో ఉంటుందని, ఒకసారి అటవీ పరిధిలోకి భూమి పోతే దాని ఓనర్‌ షిప్‌ నేచర్‌ మారదని స్పష్టం చేశారు. ‘‘ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా సర్టిఫికెట్‌ కాదు.. ఏ అడ్వొకేట్‌ను అడిగిన చెప్తరు.. పనిచేసుకునేటానికి వీలు కల్పించే పత్రం అది.. ప్రజలకు నిజాలే చెప్పాలే.. మోసం చేయొద్దు..’’ అని సీఎం అన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ సర్టిఫికెట్లు ఉన్న రైతులకు రైతుబంధు ఇవ్వాలని ట్రైబల్‌ ఎమ్మెల్యేలు కోరితే సర్టిఫికెట్లు ఉన్న 81 వేల మందికి చెందిన 2.60 లక్షల ఎకరాలకు ఇస్తున్నామని సీఎం వివరించారు. ధరణి పోర్టల్‌లో ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములకు ప్రత్యేక కాలమ్‌ పెడుతున్నామన్నారు. బయటి రాష్ట్రాల నుంచి గొత్తికోయలు మందలకు మందలు వచ్చి నరికిపారేసి కబ్జా పెడుతమంటే మన గిరిజనులు ఎటు పోవాల్నని ప్రశ్నించారు. పోడు భూముల సమస్యను ఎక్కడో ఒక్కకాడ క్లోజ్‌ చేయాలని అనుకున్నామని, తానే స్వయంగా ప్రామిస్‌ చేశానని చెప్పారు. ‘‘పోడు పేరుతో కబ్జాలు పెట్టిన భూములకు ఏడనో ఒక్కకాడ ముగింపు పలకాలె అని చెప్పిన.. ఇప్పటిదాకా సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని,  ఆ తర్వాత ఒక్క గుంట కూడా ఇవ్వొద్దని చెప్పిన’’ అని స్పష్టం చేశారు.

ధరణి నిర్వహణ ప్రైవేటుకు ఇవ్వం

రెవెన్యూ రికార్డుల నిర్వహణపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన సందేహాలపై సీఎం కేసీఆర్​ వివరణ ఇస్తూ.. రికార్డులు డిజిటల్​ రూపంతోపాటు మాన్యువల్ గా ఉంటాయని చెప్పారు. ధరణి వెబ్​సైట్​లో, సీడీలు, డీవీడీ రూపంలో డిజిటల్ ​గా, మాన్యువల్​గా నిర్వహిస్తామని వివరించారు. కొత్త సెక్రటేరియల్​లో స్ట్రాంగ్‌ రూం, రికార్డ్‌ రూంలో సర్వర్లు ఉంటాయని, దేశంలో మరో సేఫ్​ ఏరియాలో మల్టిపుల్​ సర్వర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక్కడ భూకంపమో, ఏదో వచ్చి రికార్డులు పోతే ఇంకోకాడ సేఫ్‌గా ఉంటాయన్నారు. ధరణిని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌, టీఎస్‌టీఎస్‌ నిర్వహిస్తాయని, ప్రైవేట్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

రెవెన్యూ శాఖకు 54 రకాల అధికారాలు

రెవెన్యూ శాఖకు 54 రకాల అధికారాలు ఉంటాయని సీఎం చెప్పారు. కొత్త రికార్డులను నమోదు చేయడంలో ఎవరైనా అధికారి తప్పు చేస్తే వారిని సర్వీస్‌ నుంచి రిమూవల్‌ లేదా డిస్మిస్‌ చేస్తామన్నారు. ఇది కొత్త చట్టంలో చేర్చామని తెలిపారు. భూమికి కో ఆర్డినేట్స్‌ ఇచ్చిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు.  ఎమ్మార్వోకు ఇంకా కొన్ని అధికారాలు ఉంటాయని, వాళ్లు జీఏడీకి అనుసంధానంగా పని చేస్తారని చెప్పారు.

మరో 3 చట్టాలను రద్దు చేస్తం

ఉమ్మడి ఏపీలో 160 నుంచి 170 రెవెన్యూ చట్టాలు ఉండేవని, బ్రిటిష్, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సగం చట్టాలను రాష్ట్ర ఏర్పాటు తర్వాత రద్దు చేశామని, ఇంకా 87 చట్టాలు అమలులో ఉన్నాయని సీఎం చెప్పారు. ‘‘మరో 3 చట్టాలను రద్దు చేయాలనుకుంటున్నం. స్టడీ చేస్తున్నం. ధరణి పోర్టలే సర్వస్వం కాదు. ఇది ఆరంభమే. కంక్లూజివ్​ టైటిల్స్​ ఇస్తేనే ఫైనల్. కంక్లూజివ్ టైటిల్స్ కోర్టులో ఓడితే పరిహారం ప్రభుత్వం కట్టాలి. దేశంలో ఏ ప్రభుత్వం ఈ సాహసం చేయలె. పాలకులుగా ఉన్నోళ్లు మౌనంగా ఉంటే క్రైమ్ అవుతది’’ అని అన్నారు.

వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువ

రాష్ట్రంలో 57.90 లక్షల మంది రైతులకు చెందిన కోటి 48లక్షల 57 వేల ఎకరాల భూమికి రైతుబంధు అందించామని కేసీఆర్‌ చెప్పారు. కేవలం 48 గంటల్లో రూ.7,200 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబంధు ప్రకారం వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువని పేర్కొన్నారు. భూముల వివాదాల పరిష్కారానికి సమగ్ర సర్వే సరైన మార్గమని, వీలైనంత త్వరగా దీన్ని నిర్వహిస్తామన్నారు.

ఏజెన్సీల్లో గిరిజనేతరులకూ రైతుబంధు

ఏజెన్సీ ప్రాంతాల్లోని అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతులకు రైతుబంధు ఇస్తామని సీఎం చెప్పారు. ‘‘ఏజెన్సీల్లో గిరిజనేతర రైతులు ఉన్నరు.. వారికి రైతుబంధు వస్తలేదు.. వాళ్లు ఎట్లనో అడవిలకు వచ్చిండ్రు.. ఉన్నరు.. వాళ్లకూ రైతుబంధు ఇస్తం.. చట్టంలో క్లాష్‌‌ లేకపోతే ఇచ్చేస్తం.. సీఎస్‌‌ను దీనిపై స్టడీ చేయమని ఆదేశిస్త’’ అన్నారు. ఇకపై అడవుల్లో పోడు చేయడానికి అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ‘‘అడవుల పునరుజ్జీవనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గజ్వేల్‌‌లో 30 వేల ఎకరాల అడవిని పునరుజ్జీవింపజేస్తే అడవి పందులు, కుక్కలు, నెమళ్లు వెనక్కి వచ్చాయి. హైదరాబాద్‌‌కు ప్రాణంలాంటి నర్సాపూర్‌‌ ఫారెస్ట్‌‌ ను గత ప్రభుత్వాలు నాశనం చేస్తే.. మా ప్రభుత్వం పునరుజ్జీవానికి చర్యలు చేపట్టింది” అని  చెప్పారు.