డిగ్రీలో మరో కొత్త కోర్సు

డిగ్రీలో మరో కొత్త కోర్సు
  •    వచ్చే ఏడాది నుంచి షురూ: ఉన్నత విద్యామండలి

హైదరాబాద్, వెలుగు: డిగ్రీలో మరో కొత్త కోర్సు రాబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్​లో హానర్స్​ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విధివిధానాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీ వేయనున్నారు. శుక్రవారం మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో ఉన్నత విద్యా మండలి ఈసీ సమావేశం జరిగింది. డిగ్రీ ఫస్టియర్​లో సైబర్ సెఫ్టీ సెక్యూరిటీ సబ్జెక్టు తీసుకురావాలన్న ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది. కంప్యూటర్ సైన్స్​లో హానర్స్ కోర్సు తీసుకురావాలనే అంశాన్ని మండలి అంగీకరించింది. ఈ సందర్భంగా బీఎస్సీ కంప్యూటర్స్‌‌‌‌ సైన్స్ (హానర్స్‌‌‌‌) కోర్సుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. వచ్చే ఏడాది 10–15 సర్కారు కాలేజీల్లోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రైవేటు కాలేజీలకూ అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. త్వరలోనే సిలబస్ కమిటీని వేస్తామని లింబాద్రి తెలిపారు.

బీటెక్​కు దీటుగా...

బీఎస్సీ హానర్స్​ కోర్సును బీటెక్​ కు దీటుగా తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. ఏటా డిగ్రీలో రెండున్నర లక్షల మంది వరకు చదువుతుండగా, వాటిలో 38% మంది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్​ కోర్సును తీసుకుంటున్నారు. బీటెక్​లోనూ కంప్యూటర్ సైన్స్​ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో వాటిలో వందశాతం సీట్లు నిండుతున్నాయి. దీంతో డిగ్రీలోనూ హానర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సును తేవాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.