బెట్టింగ్ తో జైలుపాలైన కంప్యూటర్స్ సైన్స్ స్టూడెంట్

బెట్టింగ్ తో జైలుపాలైన కంప్యూటర్స్ సైన్స్ స్టూడెంట్

వరంగల్ : స్పోర్ట్స్ లో  క్రికెట్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. IPL సీజన్ లో ఏ మ్యాచ్ అయినా అప్డేట్స్ ఫాలో అవుతారు పబ్లిక్. మహానగరం నుంచి పల్లె వరకూ క్రికెట్ అంటే ప్రతీ ఒక్కరికీ పండుగే.  ఇంత వరకు బానే ఉన్నా... క్రికెట్ మ్యాచ్ ల్లో బెట్టింగ్ దందా చాపకింద నీరులా విస్తరించింది. ఈజీ మనీ కోసం అప్పుల చేస్తే మరీ బెట్టింగులు పెడుతున్నారు యూత్. ఈ బెట్టింగ్ దందా టౌన్ల నుంచి పల్లెలు, తండాలను వదలి పెట్టడంలేదు.

యూత్ లో ఐతే క్రికెట్ కు యమా క్రేజ్ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతోందంటే చాలు... ఎక్కడికక్కడ యూత్ అలెర్ట్ అయిపోతారు. ఈ మ్యాచ్ ల పేరుతో మనీ సంపాదన కోసం పక్కదార్లు వెతుకున్నారు. సాయంత్రమైందంటే చాలు టీవీలు, స్మార్ట్ ఫోన్లు ముందు పెట్టుకొని ఐపీఎల్ క్రికెట్  బెట్టింగులు షురూ చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన చాలామంది బెట్టింగుల్లో పైసలు పెడుతుంటే... ఈ తతంగం అంతా నడిపించడానికి వరంగల్ సిటీలో ఏరియాకో మీడియేటర్ పని చేస్తున్నాడు. ఈ మీడియేటర్లు చైన్ సిస్టంగా పని చేస్తుండగా.. సిటీలో చాలామంది వీరి బారిన పడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే బెట్టింగులకు పాల్పడుతున్న పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. కొన్నిచోట్ల బెట్టింగులు వందలు, వేలు పోయి లక్షలకు ఎగబాకాయి. కేఫ్లు, హోటళ్లలో మకాం వేస్తూ మీడియేటర్లతో వేలు, లక్షల్లో చేతులు మారుస్తున్నాయంటే బెట్టింగ్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

గ్రేటర్ వరంగల్ పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్ చాపకింద నీరులా వ్యాపించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్టులు చేస్తున్నా ఈజీ మనీ మోజులో చాలామంది ఇవేమీ పట్టించుకోవడం లేదు. సరాదాగా బెట్ కాయడం.. ఆన్ లైన్ లో డబ్బు వచ్చేస్తుండటంతో రిస్క్ అనుకోకుండా ఎంతోమంది బెట్టింగుకు అలవాటుపడుతున్నారు. ఇలా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవంతంగా  ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు.

ఇటీవల  హనుమకొండ జిల్లా ఊరుగొండలో  బెట్టింగ్ అప్పులు  తీర్చలేక  సాంబారి నాగరాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  నాగరాజు  హనుమకొండలో చిన్న, చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఫ్రెండ్స్ తో క్రికెట్ బెట్టింగ్ అలవాటైంది. బెట్టింగ్ లో ఉన్నదంతా పోవడంతో పాటు  లక్షా 50 వేలు అప్పు చేశాడు. పేరంట్స్ కు తెలిసి ఆ అప్పు కట్టారు. ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ బాయ్ గా పనిచేస్తుండడంతో తల్లిదండ్రులు బైక్ కొనిచ్చారు. ఐపీఎల్ రావడంతో బెట్టింగ్ లు మొదలు పెట్టాడు. ఈ సారి బైక్ తాకట్టు పెట్టడంతో తల్లిదండ్రులు మందలించారు. చివరకు చేసిన అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్ లైన్ క్రికెట్  బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మంది సభ్యుల ముఠాను 15 రోజుల కిందట  టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు బుకీలు కాగా, మరో ఆరుగురు పందెం రాయుళ్లున్నారు. వీరి నుంచి పోలీసులు 5 లక్షల 55 వేలు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి 2.6 లక్షల నగదు సీజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన లావాదేవిలు మొత్తం నిందితులు గూగుల్ పే, ఫోన్ ఫేల ద్వారా నిర్వహించేవారు. 7 నెలల కిందట ఆన్ లైన్ క్రికెట్ ముఠాను అరెస్ట్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ముంబయి కేంద్రంగా వరంగల్ ను అడ్డాగా చేసుకుని క్రికెట్ ఆన్ లైన్ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసి... 2 కోట్ల 5 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్ బుక్స్, ఏటీఎం కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ బెట్టింగ్ సంస్కృతి గ్రేటర్ వరంగల్లో పాటు గ్రామాలు, తండాలకూ పాకింది.  గ్రేటర్ చుట్టుపక్కలా ఉన్న గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిలదొక్కుకున్న చాలామంది యూత్ క్రికెట్ బెట్టింగులు కాస్తున్నారు. హసన్ పర్తి మండలం చింతగట్టు, దేవన్నపేట, ఆరెపల్లి, వంగపహాడ్ గ్రామాల్లో వేల నుంచి లక్షల్లో బెట్టింగ్ దందా సాగుతున్నట్లు గుర్తించారు పోలీసులు.  ఈజీగా మనీ సంపాదించవచ్చనే ఆశతో అప్పులు చేసి మరీ బెట్టింగ్ లు పెట్టి చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు.

క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి అప్పులు తీర్చేందుకు కొంతమంది దొంగతనాలకూ పాల్పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎల్లామార్ గ్రామానికి చెందిన ఎనుబోతుల సునీల్ తల్లిదండ్రులు కూలీలు. కష్టపడి వారు సునీల్ ను కంప్యూటర్స్ సైన్స్ చదివించారు. ఈ టైమ్ లోనే ఫ్రెండ్స్ తో క్రికెట్ బెట్టింగ్ అలవాటైంది. అక్కడా ఇక్కడా అప్పులు తెచ్చి బెట్టింగులు పెట్టాడు. చివరకు ఆ అప్పు తీర్చలేక దొంగగా మారి జైలు పాలయ్యాడు. ఈజీ మని కోసం కొందరు.. సరదగా మరికొందరు జీవితాలనే బలిచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరంట్స్. క్రికెట్ బెట్టింగ్ ...ఆన్ లైన్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి వాటికి అలవాటు పడితే తమ జీవితాన్ని కోల్పోవడం, అప్పుల పాలవవ్వడం ఖాయమంటున్నారు. బెట్టింగ్ ఆడుతూ దొరికితే చట్టపరంగా కేసుల్లోనూ ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మీడియేటర్లు మ్యాచ్ ను బట్టి బెట్లు డిసైడ్ చేస్తూ అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.