డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్ కేటాయించాలని ధర్నా

డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్ కేటాయించాలని ధర్నా

హైదరాబాద్, వెలుగు: నిజాం కాలేజీలో కొత్త హాస్టల్‌‌ను డిగ్రీ విద్యార్థినులకు కేటాయించాలంటూ శనివారం ప్రిన్సిపాల్ చాంబర్ ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ..కొత్త హాస్టల్‌‌ను డిగ్రీ అమ్మాయిలకు కాకుండా పీజీ అమ్మాయిలకు కేటాయించడం సరికాదన్నారు. ఐదు రోజుల సమయం తీసుకున్న ప్రిన్సిపాల్ మళ్లీ పీజీ విద్యార్థినులకే హాస్టల్‌‌ అలాట్ చేశారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు నిజాం కాలేజీకి చేరుకున్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీస్‌‌ స్టేషన్‌‌కు తరలిస్తుండగా స్టూడెంట్లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇందులో కొంతమంది స్టూడెంట్లు గాయాలపాలయ్యారు.

కాలేజీ ప్రిన్సిపాల్ భీమా నాయక్ మాట్లాడుతూ, పీజీ గర్ల్స్‌‌కి కాలేజ్ తరఫున హాస్టల్ సౌకర్యం కల్పించాలని, డిగ్రీ అమ్మాయిలకు మరో కొత్త హాస్టల్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు సమస్య తీవ్రతను అర్థంచేసుకుని సహకరించాలని కోరారు. డిగ్రీ స్టూడెంట్స్ మాట్లాడుతూ.. తమకు తెలియకుండా హాస్టల్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించినందుకు తమపై లాఠీచార్జ్ చేయించి అరెస్ట్ చేయించారన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను పోలీసులు అబిడ్స్, రాంగోపాల్ పేట్ పీఎస్ లకు తరలించగా వారు అక్కడ కూడా ఆందోళన కొనసాగించారు. విద్యార్థి నాయకులు పోలీసులతో చర్చించడంతో రాత్రి స్టూడెంట్స్ ను విడుదల చేశారు.