రైతుల సంతోషం కాంగ్రెస్​కు ఇష్టముండదు : నిరంజన్​రెడ్డి

రైతుల సంతోషం కాంగ్రెస్​కు ఇష్టముండదు  : నిరంజన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయానికి ఉచిత కరెంట్​రద్దు చేయాలనేది కాంగ్రెస్ ​పార్టీ జాతీయ విధానమని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఉచితంగా కరెంట్​ ఇవ్వడం లేదని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్​ఎల్పీలో మంత్రి నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు 24 గంటల కరెంట్​ఇవ్వొద్దు అనే చర్చ కాంగ్రెస్​పార్టీ అసలు ఎందుకు తీసుకువచ్చిందో చెప్పాలన్నారు. వైఎస్సార్​ వ్యవసాయానికి 24 గంటల కరెంట్​ఇస్తామని ఎక్కడ అన్నారో నిరూపించాలన్నారు. 

కాంగ్రెస్​ అధికారంలో ఉన్న చత్తీస్​గఢ్​నుంచి ఇతర రాష్ట్రాలకు కరెంట్​అమ్ముతున్నారే తప్ప రైతులకు మాత్రం ఉచితంగా ఇవ్వడం లేదన్నారు. ఉచిత కరెంట్​వద్దు అని రేవంత్ ​అంటుంటే ఆయన వెంట ఉన్న నేతలు చప్పట్లు కొడుతున్నారని, దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్​ పార్టీలో ఒక్కో నాయకుడికి ఒక్కో విధానం ఉంటుందా అని మంత్రి నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు. రైతులు సంతోషంగా ఉండటం ఆ పార్టీకి ఇష్టం లేనట్టు ఉందన్నారు. 

తెలంగాణను పోరాడి సాధించుకున్నామే తప్ప కాంగ్రెస్​ పార్టీ ఇవ్వలేదన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సబ్​స్టేషన్​ దగ్గరికి వెళ్లి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్​ పార్టీ కరెంట్​ను పట్టుకొని షాక్​కు గురైందన్నారు. ఉచిత కరెంట్​పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు.