గాంధీభవన్ లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

గాంధీభవన్ లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ గాంధీభవన్ లో 137 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ  సందర్భంగా పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హెచ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మధు యాష్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, కోదండ రెడ్డి, కుసుమ కుమార్ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, సేవదళ్ చైర్మన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పుట్టిన పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అంతకు ముందే దేశం కోసం ఎంతో శ్రమించిందన్నారు. కొంతమంది కుహనా వాదులు కాంగ్రెస్ గురించి అవగాహన లేక అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సర్వమత సామరస్యం, శాంతి సమరస్యాలతో దేశానికి ఒక దిశా నిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు రేవంత్. 

శాంతి యుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చునని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో దేశంలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని సరైన దిశగా అభివృద్ధి ఫలాలను పంచిందన్నారు. అలీన విధానం, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యురిటి, ఉపాధి హామీ, సాంకేతిక అభివృద్ధి అంత కాంగ్రెస్ తోనే సాధ్యం అయ్యింది. దేశంలో ప్రాజెక్టులు నిర్మించి బీడు పొలాలలో బంగారం పండించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అన్నారు రేవంత్. నేటి పాలకులు కాంగ్రెస్ చరిత్రపైన దుమ్మెత్తి పోసి ప్రతిష్ట దెబ్బ తీయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎంత మంది ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీకి మట్టి అంటదన్నారు. 130 కోట్ల ప్రజలకు అన్ని రకాలుగా భద్రత కల్పించే పార్టీ కాంగ్రెస్ అన్నారు. 

ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో నేడు భారత దేశంలోని పౌరులు మంచి పొజిషన్ ఉన్నారు అందుకు కాంగ్రెస్ పాలన కారణమని పేర్కొన్నారు. భారత దేశం యువశక్తి తో ఉంది.. కానీ ఇప్పటి పాలకులు యువత కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. దేశంలో మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ కి కుటుంబం లేదు, పిల్లలు లేరు, ఆయనకు ఏం తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు.  ఇప్పుడు ఆడ పిల్లలకు పెళ్లి వయసు పెంచి దేశంలో ఒక అలజడి పెట్టారన్నారు. దేశంలో మత తత్వ రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు. 137 కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు రాబోయే రోజుల్లో పార్టీ ని అధికారంలోకి తెచ్చి ప్రజలకు అండదండలుగా ఉండాలన్నారు. 

ఇవి కూడా చదవండి:

కాంగ్రెస్ జెండా ఎగరేస్తుండగా.. ఊడి సోనియా చేతిలోకి

రేవంత్ రెడ్డిపై సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ