
- రేణుకా స్వామిని బెంగళూరుకు తీసుకొచ్చింది నాకు తెల్వదు
- పవిత్ర గౌడకు క్షమాపణ చెప్పించిన.. ఆపై డబ్బులిచ్చి భోజనం చేసి వెళ్లిపొమ్మన్న: దర్శన్
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడకు న్యూడ్ ఫొటోలు పంపడంతో రేణుకా స్వామిని రెండు చెంప దెబ్బలు మాత్రమే కొట్టానని నటుడు దర్శన్ పోలీసులకు తెలిపాడు. అతన్ని చంపడం తన ఉద్దేశం కాదని వివరించాడు. అసలు రేణుకా స్వామి చిత్రదుర్గ్ నుంచి బెంగళూరుకు వచ్చినప్పుడు తాను రాజరాజేశ్వరి నగర్‌లోని స్టోనీ బ్రూక్ రెస్టారెంట్లో ఉన్నట్టు తెలిపాడు. పవన్ కూడా తనతోనే ఉన్నాడని వివరించాడు.
ఎవరో హత్య చేసి తనను ఇరికిస్తున్నారని చెప్పాడు. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అన్నపూర్ణేశ్వరి నగర్ పీఎస్‌లో విచారించారు. రేణుకా స్వామిని తాను హత్య చేయలేదని పదే పదే ఎంక్వైరీలో పోలీసులకు దర్శన్ వివరించాడు. కాగా, విచారణ తర్వాత దర్శన్, పవిత్ర గౌడను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.
పవిత్ర గౌడకు క్షమాపణ చెప్పించిన
‘‘రేణుకా స్వామిది చిత్రదుర్గ్. అతన్ని బెంగళూరుకు తీసుకొచ్చిన విషయం నాకు తెలీదు. ఆ టైమ్‌లో నేను స్టోనీ బ్రూక్ రెస్టారెంట్లో ఉన్న. నాతో పవన్ కూడా ఉన్నడు. రేణుకా స్వామితో మాట్లాడేందుకు రెస్టారెంట్ నుంచి నేరుగా ఇంటికెళ్లా. అక్కడి నుంచి పవిత్ర గౌడను తీసుకొని పట్టణగెరెలోని షెడ్డుకు వెళ్లా. అప్పటికే షెడ్డులో మరికొంత మంది ఉన్నరు. నేను వెళ్లగానే రేణుకా స్వామి నాతో పాటు పవిత్ర గౌడను క్షమాపణ అడిగాడు.
రెండు చేతులు జోడించి తప్పైందని ఒప్పుకున్నాడు. కోపంతో నేను రెండు చెంప దెబ్బలు కొట్టిన. చంపాలనే ఉద్దేశంలేదు. కొంత డబ్బిచ్చి.. లంచ్ చేసి ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పా. ఆపై అక్కడి నుంచి నేరుగా ఇంటికొచ్చేశా” అని నటుడు దర్శన్ పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత షెడ్డులో ఏం జరిగిందో తనకు తెలీదని వివరించాడు. అక్కడున్నవాళ్లే రేణుకా స్వామిని హత్య చేసి.. తనను ఇరికించారని తెలిపాడు.
ప్లాన్ ప్రకారమే హత్య జరిగిందంటున్న పోలీసులు
ప్లాన్ ప్రకారమే రేణుకా స్వామిని దర్శన్ హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రేణుకా స్వామి డెడ్‌బాడీ తరలించేందుకు ఉపయోగించిన స్కార్పియో కారులో దర్శన్ ఫొటో ఉందని చెప్తున్నారు. దానిని నిందితులు తొలగించారని ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన రికార్డుల్లో కారు ఫొటో క్యాప్చర్ అయిందని తెలిపారు. రేణుకా స్వామిని చంపే ముందు బాగా హింసించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. రేణుకా స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి.. కర్రలు, పైపులు, బెల్టుతో కొట్టినట్టు శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. షెడ్డులో దొరికిన షూస్, బట్టలను సీజ్ చేసిన పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించారు.
నిందితుల్లో ఒకరి తండ్రి హార్ట్ ఎటాక్‌తో మృతి
రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనుకుమార్ తండ్రి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.అనుకుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పటి నుంచి చంద్రప్ప డిప్రెషన్లో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కోర్టు పర్మిషన్తో శనివారం రాత్రి అనుకుమార్ను టైట్ సెక్యూరిటీ మధ్య బెంగళూరు నుంచి చిత్రదుర్గ్ తీసుకొచ్చి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేయించాక మళ్లీ తీసుకెళ్లిపోయారు.