కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం...కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

కార్మికుల సమస్యలు  పరిష్కరిస్తం...కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అధికారంలోకి రాగానే కనీస వేతనాలు పెంచినం
  •     గిగ్​వర్కర్స్ యాక్ట్​ తెచ్చి భరోసా కల్పించాం
  •     జలమండలి కార్మిక సంఘాల ఎన్నికల్లో టీజేఈయూ అధ్యక్ష అభ్యర్థి రాజిరెడ్డిని గెలిపించండి
  •     ఎన్నికల ప్రచార సభలో  మంత్రి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని కార్మికశాఖ మంత్రి వివేక్​ వెంకట స్వామి స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను గుండెల్లో పెట్టుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ నెల 6న జరిగే జలమండలి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఏడు కార్మిక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ (టీజేఈయూ) అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి త్రిశూలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 

మంగళవారం ఖైరతాబాద్​లోని మెట్రోవాటర్​బోర్డు కార్యాలయంలో గేట్ మీటింగ్​నిర్వహించగా ఇందులో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలే యాదయ్య, నవీన్​యాదవ్​ పాల్గొన్నారు. మంత్రి వివేక్​వెంకటస్వామి మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకే గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చినట్టు తెలిపారు. తన తండ్రి కాకా వెంకటస్వామి, ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ రెడ్డి కలిసి కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కార్మికుల్లో కనిపిస్తున్న జోష్ చూస్తే ఐఎన్​టీయూసీ తప్పకుండా గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధిలేదన్నారు. ఆపార్టీ కార్మిక వ్యతిరేక పార్టీ అని అన్నారు. 

వారి హయాంలో ఆర్టీసీ సమ్మె జరిగి 54 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయినా స్పందించలేదని విమర్శించారు. సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలను బీఆర్ఎస్ రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే కనీస వేతనాలు పెంచిందన్నారు. గిగ్ వర్కర్స్ యాక్ట్, కనీస వేతనాలు అమలు చేస్తున్న తర్వాత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత నమ్మకం ఏర్పడిందన్నారు. రాజిరెడ్డి గెలిచాక వాటర్ బోర్డు మేనేజ్మెంట్ తో మాట్లాడి జలమండలి కార్మికుల సమస్యలన్నీ తీరుస్తామన్నారు. ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి మాట్లాడుతూ జలమండలిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ అనుబంధ వ్యక్తిని గెలిపించాలి..

ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న వ్యక్తిని గెలిపించాలని, అప్పుడే కార్మికులు తమ హక్కులు పొందే అవకాశం ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఈ నెల 6న జరిగే ఎన్నికల్లో త్రిశూల గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. జలమండలి ఎంప్లాయీస్​ యూనియన్ ​అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ రెండేండ్లుగా జలమండలి కార్మికుల పక్షాన ఉంటూ, అనేక సమస్యలను పరిష్కరించానని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లను రద్దు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. 

తాను గెలిచాక ప్రభుత్వంతో మాట్లాడి జలమండలి కార్మికుల కోసం కల్యాణ మండపం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యూనియన్ ఉపాధ్యక్షుడు జి.సత్యజిత్ రెడ్డి, ఐఎన్‌‌‌‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి. చంద్రశేఖర్, వై.నాగన్న గౌడ్, ఆదిల్ షరీఫ్, ఎఐటీయూసీ సీనియర్ నాయకులు వి.ఎస్.బోస్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు కె.రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఇ.చంద్రశేఖర్, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొని జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జలమండలి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 

కాంగ్రెస్​ను కార్మికులను వేరుగా చూడలేం: మహేశ్​గౌడ్

కాంగ్రెస్ పార్టీని, కార్మిక లోకాన్ని వేరుచేసి చూడలేమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా కార్మికులకు కావాల్సింది వారికి అండగా నిలిచే నాయకుడని, ఆ లక్షణాలన్నీ మొగుళ్ల రాజిరెడ్డిలో ఉన్నాయని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ ను జలమండలి ఎన్నికల్లో కార్మికులు ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ రాజిరెడ్డికి కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఆరు సంఘాలు యునానిమస్ గా రాజిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయన్నారు.