సెప్టెంబర్ 17న తుక్కుగూడలోనే కాంగ్రెస్​ సభ

సెప్టెంబర్ 17న తుక్కుగూడలోనే కాంగ్రెస్​ సభ
  • రాష్ట్రానికి పెద్ద బకాసురుడిలా కేసీఆర్​ తయారైండు
  • సీడబ్ల్యూసీ మీటింగ్స్​కు హోటల్​ ఇవ్వొద్దని మేనేజ్​మెంట్​ను కేటీఆర్​ బెదిరించిండు
  • తుక్కుగూడలో సభ ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ఈ నెల 17న నిర్వహించనున్న ‘విజయభేరి సభ’కు బీఆర్​ఎస్​, బీజేపీ అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆరోపించారు. ‘‘సభ కోసం తొలుత పరేడ్​గ్రౌండ్​ అనుకున్నం. పర్మిషన్​ కోసం దరఖాస్తు చేసుకుంటే.. అదేరోజు బీజేపీ సభను నిర్వహిస్తూ మాకు అనుమతి నిరాకరించిన్రు. బీజేపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు అక్కడ కిషన్​ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నరు. బీజేపీ, బీఆర్​ఎస్​ కుట్ర చేసి పరేడ్​గ్రౌండ్​ ఇవ్వలేదు” అని ఆయన దుయ్యబట్టారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అడిగితే స్పోర్ట్స్​ అథారిటీ కుదరదని చెప్పిందన్నారు. ట్రాఫిక్​ సమస్య లేకుండా ఉంటుందని, ఓఆర్ఆర్ నుంచి జాతీయ నాయకులు ఈజీగా వెళ్లేందుకు ఉంటుందని తుక్కుగూడ ఖాళీ స్థలాన్ని ఎంచుకుంటే.. దేవుడి మాన్యం అని చెప్పి పర్మిషన్​ తిరస్కరించారని ఆయన మండిపడ్డారు. 

అయితే, రైతులు ముందుకొచ్చి సభ కోసం తమ భూములిచ్చారని, వంద ఎకరాల్లో తుక్కుగూడలోనే సభను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తుక్కుగూడలో సభ నిర్వహించే స్థలాన్ని శనివారం ఆయన పార్టీనేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్​ సభ జరిగితే పతనం ఖాయ మని బీఆర్ఎస్​కు భయం పట్టుకుందని అన్నారు.  

ఆ విజ్ఞత కేసీఆర్​కు లేదు

‘‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో సహకరించాల్సిందిపోయి ఆటంకాలు సృష్టిస్తున్నది. కేసీఆర్​కు విజ్ఞత లేదు.  6 నెలలు తింటడు.. మరో 6 నెలలు ఫాంహౌస్​లో పండుకుంటడు. రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద బకాసురుడు కేసీఆర్​” అని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. అధికారం ఉందని అణచివేస్తామని కేసీఆర్​ అనుకుంటే.. ఆ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ‘‘సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించేందుకు ఓ హోటల్​ను మాట్లాడుకుంటే.. ఆ హోటల్​ వాళ్లను కేటీఆర్​ బెదిరించిండు. 

కాంగ్రెస్​ పార్టీకి హోటల్​ ఇవ్వకుండా అడ్డుకున్నడు. ఇవేం చిల్లర రాజకీయాలు?” అని మండిపడ్డారు. ఈ నెల 16న తాజ్​కృష్ణ హోటల్​లో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహిస్తామని, కీలక నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకుంటారని రేవంత్​ చెప్పారు. 17న జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని అన్నారు. ఖమ్మం సభకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిందని, అయినా వాటన్నింటినీ దాటుకుని ఎట్లయితే వచ్చారో అట్లనే లక్షలాది మంది యువత, రైతులు, నిరుద్యోగులు విజయభేరి సభకు తరలిరావాలని రేవంత్​కోరారు. కేసీఆర్, కిషన్​రెడ్డి  ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్​ విజయభేరి సభను అడ్డుకోలేరని ఆయన చెప్పారు. 

యూరియా కొరతపై సీఎంకు లేఖ

‘‘రైతులకు వంద శాతం ఎరువులు ఉచితంగా సరఫరా చేస్తామని 2017 ఏప్రిల్​13న ప్రగతిభవన్​ సాక్షిగా సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. అన్ని హామీల్లాగానే ఈ మాటకూ దిక్కు లేకుండా పోయింది. ఆరు నూరు అవుతుందేమోగానీ.. కేసీఆర్​ మాత్రం మాట మీద నిలబడరన్న విషయం మరోసారి నిరూపితమైంది” అని రేవంత్​రెడ్డి శనివారం సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో దుయ్యబట్టారు. నల్గొండ జిల్లాతో పాటు సీఎం సొంత జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

‘‘ఉచిత ఎరువులు అని రైతుల చెవిలో మీరు(కేసీఆర్​) పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయి. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉచిత ఎరువులు సంగతేమోగానీ, పైసలిచ్చి కొందామనుకున్న ఎరువులు దొరక్క అల్లాడే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు’’ అని పేర్కొన్నారు.