హౌడీ మోదీ కంటే నమస్తే ట్రంప్ పైచేయి : జైరాం రమేశ్ విమర్శ

హౌడీ మోదీ  కంటే  నమస్తే ట్రంప్ పైచేయి :  జైరాం రమేశ్ విమర్శ
  • కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శ

న్యూఢిల్లీ: ఇండియా– అమెరికా ట్రేడ్ డీల్​పై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ విమర్శించింది. ‘హౌడీ మోదీ’ కంటే ‘నమస్తే ట్రంప్’ పైచేయి సాధించారని ఎద్దేవా చేసింది. ఈ డీల్ ఇండియాకు వ్యతిరేకంగా ఉందని.. కౌగిలింతలు, ఫొటోషూట్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని మండిపడింది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ట్రేడ్ డీల్ గురించి ఇండియా– అమెరికా జాయింట్ స్టేట్​మెంట్​లో వివరాలు సరిగ్గా వెల్లడించలేదు.

కానీ, రష్యా నుంచి భారత్ ఇకపై ఆయిల్​ను దిగుమతి చేసుకోదని తెలుస్తోంది. దేశంలోని రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి, అమెరికన్ రైతులకు మేలు చేసేలా భారత్ దిగుమతి సుంకాలను తగ్గించనుంది. యూఎస్‌‌ దిగుమతులు మూడు రెట్లు పెరగనుండటంతో మన వాణిజ్య మిగులు తుడిచిపెట్టుకుపోతుంది. ఆ దేశానికి భారత్ చేసే ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై అనిశ్చితి కొనసాతోంది.

ఈ క్రమంలో మనం ఎగుమతులు చేసే కొన్ని వస్తువులపై మునుపటికన్నా ఎక్కువ సుంకాలు ఉంటాయి. కౌగిలింతలు, ఫొటోషూట్​ల వల్ల ఒరిగిందేమీ లేదు. చివరకు ‘హౌడీ మోదీ’ కంటే ‘నమస్తే ట్రంప్’ పైచేయి సాధించారు’’ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.