దేశంలో స్వేచ్ఛ లేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడితే అక్రమ అరెస్టులు, వారిపై సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశంలో అమలు జరగడం లేదన్నారు. దేశ సంపదను కొల్లగొట్టి కొద్ది మందికి పంచుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో సోదరభావం లేకుండా చేస్తున్నారని చెప్పారు. ఒకరిని మరొకరు విమర్శించుకునే పరిస్థితిని కల్పిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెడితే కనీసం ఈ మూడు అంశాలను సభ్యులు మననం చేసుకుంటూ..ప్రజల సమస్యలపై చర్చిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టేందుకు తీర్మానం ప్రవేశపెట్టడంపై భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాజం ఎలా ఉండాలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ద్వారా చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తి సరైన విధంగా ఉంటే..రాజ్యాంగం వందకు వంద శాతం అమలవుతుందని అంబేద్కర్ భావించారన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని వీహెచ్ నిరసన తెలిపారని గుర్తు చేశారు. కానీ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పలేదన్నారు. విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లోని గ్రౌండ్ లోకి తీసుకెళ్లారని..ఇప్పటికైనా అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
