- అన్ని రాష్ట్రాలు సమానమనే విధానానికి వ్యతిరేకంగా బీజేపీ చర్యలు
- ఎన్డీయే ప్రభుత్వ అధిపత్య ధోరణిని నిలువరించినం
- తమిళ భాష, కల్చర్, చరిత్రపై బీజేపీ దాడి
- ట్రంప్ కంట్రోల్లో మోదీ పని చేస్తున్నారని ఆరోపణ
చెన్నై: దక్షిణ, చిన్న, ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ చేయాలని కేంద్రం కుట్ర పన్నిందని తెలిపారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల పేరిట డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూసిందని చెప్పారు. వాస్తవానికి మహిళా బిల్లుకు 2023లోనే ఆమోదం లభించిందని వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పొన్నేరి, రాణిపేటలో కాంగ్రెస్, డీఎంకే నిర్వహించిన ర్యాలీల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత యూనియన్‌లో తమిళనాడు, దక్షిణాది, చిన్న, ఈశాన్య రాష్ట్రాలను బలహీన పరచాలని బీజేపీ డీలిమిటేషన్ తీసుకొస్తున్నదన్నారు. అందుకే ఆ ముసుగు బిల్లును ఓడించామని చెప్పారు. ఇది బలప్రయోగం, ఏకాభిప్రాయం మధ్య పోరాటమని.. రెండు, మూడు శక్తులు నియంత్రించే భారత్‌ను బీజేపీ కోరుకుంటున్నదని విమర్శించారు.
అన్నాడీఎంకే.. బీజేపీ ముసుగు మాత్రమే..
భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని, కేంద్రంలో ప్రతి రాష్ట్రానికి మాట్లాడే అవకాశం, భాష, సంప్రదాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునే వీలుండాలని రాహుల్ అన్నారు. ఢిల్లీ నుంచి తమిళనాడును పాలించాలని మోదీ కోరుకుంటున్నారని, అన్నా డీఎంకేను అందుకే అధికారంలోకి తేవాలని చూస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తమిళుల కోసం పోరాడిన అన్నాడీఎంకే చాలా కాలం క్రితమే మృతిచెందిందని, నేటి అన్నాడీఎంకే కేవలం బీజేపీ ముసుగు మాత్రమేనని అన్నారు.
పెరియార్ఆలోచనలు, విధానాలు, సామాజిక న్యాయం అనే నమూనాలను నాశనం చేయాలని ఆ పార్టీ చూస్తోందన్నారు. తమిళ భాష, సంస్కృతి, చరిత్రపై బీజేపీ దాడి చేయాలని చూస్తోందని హెచ్చరించారు. రాణిపేట ర్యాలీలో రాహుల్ గాంధీ బీజేపీ, మోదీపై మరింత ఘాటు విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు మోదీ చేస్తున్నారని, ఇండో–అమెరికా ఒప్పందంతో దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ఎప్‌స్టీన్ ఫైళ్లు, అదానీతో మోదీ సంబంధాల ద్వారా ట్రంప్ మన ప్రధానిని కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.

