- బాల్క సుమన్ విషయంలో కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాలో విరుచుకుపడ్డారు. ‘‘మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తప్పని, అలా మాట్లాడాల్సింది కాదని మీడియా ముందే తప్పుపట్టిన కేటీఆర్.. ఆ తర్వాత 24 గంటలు కూడా గడవక ముందే సుమన్‌ను కలిసి ఆయన మాటలను సమర్థించడం ఏంటి?’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘‘కేటీఆర్‌ది నాలుకనా... తాటి మట్టనా?’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో విధ్వంసాన్ని ప్రేరేపించేలా మాట్లాడిన బాల్క సుమన్‌కు బీఆర్ఎస్ తరపున షోకాజ్ నోటీసు ఇవ్వాల్సింది పోయి, ఆయన్ను కేటీఆర్ సమర్థించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఇష్టానుసారంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుల తీరును తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సరైన రీతిలో గౌరవిస్తుంది కేవలం తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు.
