- అందుకే సోషల్ మీడియాలో దాడి చేసి క్షమాపణ చెప్పించుకున్నరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: 15 ఏండ్ల బాలిక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భయపడ్డారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. అందుకే తమ పార్టీ నేతలతో ఆ చిన్నారిపై ఆన్‌లైన్‌లో దాడి చేయించి, బలవంతంగా క్షమాపణ చెప్పించుకున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ మకర ద్వారం ఎదుట విద్యార్థులపై పోలీసుల దాడి, అయోధ్య విరాళాల దొంగతనానికి నిరసనగా ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనలో సోమవారం ఆయన పాల్గొని, నిరసన తెలిపారు.
అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ... ప్రధానిపై వ్యాఖ్యలు చేసిందనే నెపంతో సదరు బాలికపై హత్య, అత్యాచారం బెదిరింపులకు పాల్పడుతూ బీజేపీ నేతలు ఆన్‌లైన్ టార్గెట్ చేశారని మండిపడ్డారు. చివరికి ఆ అమ్మాయితో ప్రధానికి క్షమాపణ చెప్పించారని ఆరోపించారు. ‘‘ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే లేదా రీల్ చేస్తే ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తారా.. రేపిస్టులను జైళ్ల నుంచి బయటకు తెచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకునే సంస్కృతి బీజేపీది’’ అని మండిపడ్డారు. భారీ మార్కెటింగ్ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ... ‘అచ్చే దిన్, రామ్ మందిర్’ అంటూ నినాదాలు ఇచ్చారని ఎంపీ గుర్తుచేశారు.
కానీ, ఆయన పాలనలోనే కోట్లాది భక్తుల విశ్వాసాలకు ద్రోహం చేస్తూ అయోధ్య రామమందిర చందాల చోరీ ఎందుకు జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల క్రూరత్వం, రామమందిర విరాళాల చోరీ అంశాలపై పార్లమెంటుకు వచ్చి మాట్లాడే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. మరోవైపు, అయోధ్య చందాల చోరీ, విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని, ఈ విషయాలపై మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం సభ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ఖర్గే, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, అనిల్ కుమార్ నిరసన చేపట్టారు.
