పీసీసీ మెంబర్లు, కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో గోల్ మాల్!

పీసీసీ మెంబర్లు, కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో గోల్ మాల్!

పైసా పెట్టు...పోస్ట్ కొట్టు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి మారింది. రీసెంట్ గా పీసీసీ మెంబర్లు, కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో భారీగా డబ్బులు వసూల్ చేశారనే చర్చ నడుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ కు తెలియకుండానే పదవుల పంపకం జరిగిపోయింది. పర్యవేక్షణ చేయాల్సిన ఓ నేతే.. చేతివాటాన్ని ప్రదర్శించారనే టాక్ వినిపిస్తోంది. 

కాంగ్రెస్ లో మరో వివాదం

కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పీసీసీ మెంబర్స్, కోఆప్షన్ సభ్యుల ఎంపిక ఈ సారి రచ్చకు కారణమైంది. సంస్థాగత ఎన్నికల కోసం ఎన్నుకుంటున్న సభ్యులు దొడ్డిదారిన వచ్చారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. పర్యవేక్షణకు వచ్చిన ఓ నేత పెద్దఎత్తున డబ్బులు వసూల్ చేసుకొని పోస్టులను అమ్ముకున్నాడనే విమర్శ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే హస్తం పార్టీని షేక్ చేస్తుంది.

ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపిక

ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పీసీసీ సభ్యులను ఎన్నుకుంటారు. పీసీసీ మెంబర్లే.. ఏఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటింగ్ లో పాల్గొంటారు. దీంతో పీసీసీ మెంబర్లు చాలా లిమిటెడ్ గా ఉంటారు. ప్రతీ నియోజకవర్గానికి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 238 మందికి మాత్రమే జాబితాలో చోటు ఉంటుంది. కో ఆప్షన్ సభ్యులుగా మరో 15 శాతం ఎన్నుకుంటారు. అంటే 36 మందికి అవకాశం కల్పిస్తారు. కానీ కో ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ లో అర్హత ఉండదు. ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపిక లో పీసీసీ మెంబర్స్ కీలకం కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకున్న కొందరు నేతలు పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డికి కూడా సమాచారం లేకుండా
 
పీసీసీ డెలిగేట్స్ జాబితా 238 ప్లస్ 36 మాత్రమే ఉండాలి. కానీ రాత్రికి రాత్రి జాబితాలోకి 386 పేర్లు చేరాయి. ఇన్ని పేర్లు ఎలా వచ్చాయో అంతుపట్టక ముఖ్య నేతలు తెల్ల మొహం వేస్తున్నారు. జాబితాలో ఉండాల్సిన వాటి కంటే అదనంగా 112 పేర్లు ఎక్కువ ఉండే సరికి ముఖ్య నేతలు పరేషాన్ అయ్యారు. చివరికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా కనీస సమాచారం లేకుండా జాబితాలోకి పేర్లు వచ్చి చేరే సరికి ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు. ఒక వైపు రేవంత్, మరోవైపు సీనియర్లు ఇచ్చిన వారి పేర్లు కాకుండా కొత్త పేర్లు లిస్ట్ లో ఉండడంతో షాక్ కు గురయ్యారు. అసలు విషయం తెలిసి పీసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

పార్టీలో అంతర్గత విచారణ మొదలైంది

పీసీసీ మెంబర్స్, కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో సహాయక పర్యవేక్షకుడిగా వచ్చిన ఓ నేతే ఈ పని చేసినట్లు పీసీసీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రానికి అసిస్టెంట్ ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ గా వచ్చిన రాజ్ బఘేల్ ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు హస్తం నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. రాజ్ బఘేల్.. పీసీసీ మెంబర్ డిమాండ్ ను ఆసరా చేసుకొని రాత్రికి రాత్రి పేర్లను చేర్చారు. ఒక్కొక్కరి నుంచి వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్ బఘేల్ కు ఇంటర్నల్ గా ఎవరు సహకరించారనే దానిపై పార్టీలో అంతర్గత విచారణ మొదలైంది. అక్రమాలు చేసిందెవరనేది తేలితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీసీసీ చూస్తోంది. 

అధిష్టానానికి ఫిర్యాదు

ఇక కీలకమైన పీసీసీ మెంబర్ల విషయంలో జరిగిన అవకతవకలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వాటిపై రివ్యూ చేయాలని ఏఐసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. పీసీసీ చీఫ్ కు సమాచారం లేకుండా పెద్ద ఎత్తున జాబితాలోకి పేర్లు వచ్చాయని.. వెంటనే పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలని కోరారు. అధిష్టానం రంగంలోకి దిగి జరిగిన అవకతవకలను సరి చేస్తుందా ? లేక చూసీ చూడనట్లుగా వదిలేస్తుందా ? అనేది చూడాలి. మొత్తానికి సందట్లో సడేమియాలా కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉంటే.. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఇంఛార్జ్ గా వచ్చిన నేతలు దండిగా దండుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.