పార్టీ లేకుంటే ప్రభుత్వం ఉండదు : పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్

పార్టీ లేకుంటే ప్రభుత్వం ఉండదు : పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
  •     ప్రభుత్వాలు లేకున్నా.. పార్టీ శాశ్వతం: పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ 
  •     అన్ని నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడి
  •     భువనగిరిలో నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

యాదాద్రి, వెలుగు: “పార్టీ లేకుంటే ప్రభుత్వం ఉండదు.. ప్రభుత్వాలు లేకున్నా పార్టీ శాశ్వతం..  కార్యకర్తలే పార్టీకి బలం”అని పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పార్టీ శ్రేణుల కృషే కారణమని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కష్టపడ్డారు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. వివిధ కారణాల వల్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమై కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొన్న విషయం తనకు తెలుసని మహేశ్‌‌ గౌడ్ తెలిపారు. నెలాఖరులోపు ఫెడరేషన్ డైరెక్టర్లు సహా నియామకాలు చేపడుతామన్నారు.  ఏప్రిల్ నెలాఖరులోపు చైర్మన్ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణలో కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మకమని,  దేశంలో కుల సర్వే నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా బీజేపీ అడ్డంకుందని ఆరోపించారు. బీఆర్‌‌ఎస్ పాలనలో చేసిన అప్పుల కారణంగా ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని, అయినప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ మళ్లీ వంద సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యకర్తలపై ఎంపీ చామల సీరియస్

​భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలపై సీరియస్​ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో సమన్వయం లేకపోవడంతో మనపై మనమే పోటీ చేసుకొని నష్టపోయామన్నారు. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు మాట్లాడుతుండటాన్ని చూసి “ఇక్కడ సీరియస్‌‌గా మాట్లాడుతుంటే వినకుండా ‘పీకనీకి’ వచ్చారా?” అని ఆగ్రహించారు. 

దీంతో సభలో కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. “పార్టీ గుర్తుపైనే గెలిచాం. పనితీరు నివేదిక లేకుంటే వచ్చే ఎన్నికల్లో గెలవలేం.. వీపు మీద గుద్దుతరు.. గెలిచినోడే ‘రియల్​ నాయకుడు’ అని అన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ బండ్రు శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, మున్సిపల్ చైర్‌‌పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.