తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు .. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసన

తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు ..  గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని ఎన్ఎస్​యూఐ విమర్శించింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేటికీ పరిష్కారించలేదని ఆరోపించింది.  “రాష్ట్రం అడిగినవి ఇవి(ఫ్లెక్సీ).. బీజేపీ ఇచ్చింది ఇది” అని రాసి, గాంధీభవన్ వద్ద గుడ్డు ఆకారంలో బొమ్మను ఏర్పాటు చేసి వినూత్న నిరసనతో ఎన్ఎస్ యూఐ సోమవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణకు నిధులు, మేడారం జాతరకు, పాలమూరు చేవేళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా  ఇవ్వమంటే బీజేపీ మన రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. 

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా కేంద్ర నిధుల్లో వాటా, కృష్ణ జలాల్లో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వమంటే  బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా తెలంగాణ అభివృద్ధికి సహకరించలేదని ఆరోపించారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఈటల రాజేందర్ ఇతర నాయకులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని మళ్లీ గెలిపిస్తే ఇంకా పెద్ద గాడిద గుడ్డు ఇస్తారే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయరర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, బెల్లయ్య నాయక్ , ఎన్ఎస్​యూఐ నేతలు పాల్గొన్నారు.