కర్నాటకలో సీఎం మార్పు లేదు.. రాజ్య సభ సీట్లపైనే చర్చ: కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ

కర్నాటకలో సీఎం మార్పు లేదు.. రాజ్య సభ సీట్లపైనే చర్చ: కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ

బెంగళూర్: కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ కావడంతో కర్నాటక నాయకత్వ మార్పు గురించి జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కర్నాటక సీఎం మార్పు గురించి కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. కర్నాటకలో సీఎం మార్పు లేదని తేల్చి చెప్పింది. కర్నాటకలో సీఎం మార్పుపై అన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‎తో కర్నాటక రాజ్య సభ ఎన్నికల గురించి మాత్రమే చర్చించినట్లు కాంగ్రెస్ అధిష్టానం వివరణ ఇచ్చింది. హైకమాండ్ క్లారిటీతో కర్నాటక నాయకత్వ మార్పు వార్తలకు తెరపడింది. 

మంగళవారం (మే 26) ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కర్నాటక నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఈ భేటీకి తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నాటక సీఎం  మార్పు గురించే ఈ సమావేశంలో చర్చించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. 

కర్నాటకలో సీఎం మార్పు లేదు: కేసీ వేణుగోపాల్

ఈ భేటీ అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మీడియాతో సమావేశ వివరాలను వెల్లడించారు. కర్నాటక సీఎం  మార్పు లేదని తెలిపారు. సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తమని కొట్టిపారేశారు.  కేవలం రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తొలగించే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. 

పవర్ షేరింగ్ ఊహాగానాలు:

2023లో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో హైకమాండ్ అంతర్గతంగా పవర్ షేరింగ్ ఒప్పందాన్ని కుదిర్చినట్లు టాక్. ఈ అగ్రిమెంట్ ప్రకారం తొలి రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య.. ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ కు సీఎం పగ్గాలు అప్పగించాలి. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది.

దీంతో ఒప్పందం ప్రకారం తమ నేతకు సీఎం సీటు అప్పగించాలని డీకే వర్గం డిమాండ్ చేస్తోంది. చివరకు ఈ అంశం హైకమాండ్‎కు చేరింది. కర్నాటకలో నాయకత్వ మార్పు అంశాన్ని హైకమాండ్ డీల్ చేస్తోంది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్యను రాజ్యసభ ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి తీసుకువచ్చి, డీకే శివకుమార్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ కర్నాటకలో నాయకత్వ మార్పు లేదని హైకమాండ్ ప్రకటించడంతో సీఎం మార్పు ఊహాగానాలకు ఎండ్ కార్డ్ పడింది.