బాలుడి మృతి కేసు: పసివాడి ప్రాణానికి రూ.10 లక్షల వెలకడుతున్నారు

బాలుడి మృతి కేసు: పసివాడి ప్రాణానికి రూ.10 లక్షల వెలకడుతున్నారు

బిల్డ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే బిల్డింగ్ పిల్లర్ గుంతలో పడి బాలుడు మృతి చెందాడ‌ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 5లోని దుర్గాభవాని నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం గుంతలో పడి మూడేళ్ల బాలుడు సిద్ధు మృతి చెందాడు. భవనం వద్ద భారీ గుంత ఉండడం వల్ల తమ బిడ్డ ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడి చనిపోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాలుడి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్,అనిల్ కుమార్ లు ప‌రామ‌ర్శించారు. అనంత‌రం శ్ర‌వ‌ణ్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్డర్, జీహెచ్ఎసి నిర్లక్ష్యం కారణంగా ఒక బాలుడు చనిపోయాడ‌ని అన్నారు. బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక వాచ్ మెన్ ను పెట్టుకోవాలి కానీ, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని, చుట్టూ ప్రహరీ గోడ కానీ, రేకులు గాని ఎందుకు పెట్టలేదని ప్ర‌శ్నించారు. బిల్డర్, జిహెచ్ఎంసి అధికారులపై హత్య నేరం క్రింద కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.

పసివాడి ప్రాణానికి బిల్డర్ 10 లక్షలకు వెలకడుతున్నారని, బాలుడి కుటుంబాన్ని మభ్యపెడుతున్నారని శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. పేదల పట్ల అరాచకం జరుగుతుందని, ఈ ఘ‌ట‌న‌ను ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామ‌ని చెప్పారు.