అన్నంత పని చేసిన కాంగ్రెస్: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం తీర్మానం

అన్నంత పని చేసిన కాంగ్రెస్: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం తీర్మానం

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అన్నంత పని చేసింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు ప్రతిపక్ష నాయకులు కె సురేష్, మహ్మద్ జావేద్ మంగళవారం (ఫిబ్రవరి 10) లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకం చేసినట్లు ఇండియా కూటమి వర్గాలు వెల్లడించాయి. 

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈ చర్యకు దూరంగా ఉంది. అవిశ్వాస తీర్మానం నోటీసుపై టీఎంసీ ఎంపీలు సంతకాలు చేయలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C కింద లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై మంగళవారం (ఫిబ్రవరి 10) అవిశ్వాస నోటీసులు అందించినట్లు కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ఉప ప్రతిపక్ష నేత గౌరవ్ గొగోయ్ మీడియాకు వెల్లడించారు. 

ఆర్టికల్ 94 సీ ప్రకారం నోటీసు..

లోక్ సభ స్పీకర్‎పై అవిశ్వాసానికి సంబంధించి ఆర్టికల్ 94 సి ప్రకారం 14 రోజుల ముందు నోటీసులు జారీ చేసే వీలుంటుంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ ప్రతిని ఇప్పటికే సిద్ధం చేయగా.. మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. స్పీకర్‎పై అవిశ్వాసానికి ప్రధాన కారణంగా సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడమేనని ఎంపీలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. రాహుల్‎కు మైక్ ఇవ్వకపోవడం, పార్టీకి చెందిన 8 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాలపై పట్టుబడుతోంది. అలాగే, ప్రధాని మోడీపై ప్రతిపక్ష ఎంపీలు దాడికి ప్రయత్నించారంటూ స్పీకర్ నిరాధార ఆరోపణలు చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మాన నోటీసుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ స్పీకర్ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించినా.. ప్రతిపక్షాల వద్ద సరిపడా సంఖ్యా బలం లేకపోవడంతో తీర్మానం వీగిపోతుందని అధికార పక్షాలు పేర్కొంటున్నాయి.