సెక్రటేరియట్  నిర్మాణం దసరా నుంచి!

సెక్రటేరియట్  నిర్మాణం దసరా నుంచి!
  • ఫాంహౌస్​లో ఉండి డిజైన్లపై సీఎం చర్చలు
  • సర్కారుకు అందిన 10 డిజైన్లు.. మూడు ఫైనల్ చేయనున్న సీఎం 
  • వాస్తుకు అనుగుణంగా మార్పులు , చేర్పులు.. వెంటనే టెండర్లు
  • కూల్చివేత, నిర్మాణ పనులు ఒకే కంపెనీకి ఇచ్చే అవకాశం

హైదరాబాద్ ,వెలుగు:కొత్త సెక్రటేరియట్​ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. ఇటీవల హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో పాత సెక్రటేరియట్ ను పూర్తిగా మూసివేశారు. ఈ నెల చివరి వారంలో దాని కూల్చివేత పనులు స్టార్టయ్యే చాన్స్​ ఉంది. ఆ పనులు పూర్తికాగానే.. దసరా నుంచి కొత్త సెక్రటేరియట్​ నిర్మాణం పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఇప్పుడున్న సెక్రటేరియట్​ దగ్గరే ఏడాది కింద కొత్త సెక్రటేరియట్​ కోసం సీఎం కేసీఆర్​ భూమి పూజ కూడా చేశారు. గత వారం రోజులుగా ఫాం హౌస్ లో ఉంటున్న ఆయన కొత్త సెక్రటేరియట్​ డిజైన్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు ప్రభుత్వ వాస్తు అడ్వయిజర్​, సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హఫీజ్ కాంట్రాక్టర్ తో పాటు ఇతర కంపెనీలు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సుమారు 10 డిజైన్లను ఆర్ అండ్​ బీ శాఖకు ఇవ్వగా.. వీటిని సీఎం కేసీఆర్ కు ఆ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

ఆర్కిటెక్  కంపెనీలు అందజేసిన డిజైన్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ వాటిలో మూడు డిజైన్లను వారంరోజుల్లో ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటిలో పలు స్వల్ప మార్పులు, చేర్పులు సూచించనున్నట్లు సమాచారం. అటు తర్వాత కంపెనీల ప్రతినిధులతో సీనియర్​ ఆఫీసర్లు చర్చలు జరుపనున్నారు. ‘‘ఆర్కిటెక్ కంపెనీలు పంపిన 10 డిజైన్లను సీఎం పరిశీలిస్తున్నారు. త్వరలో వీటిలో రెండు లేదా మూడు డిజైన్లను సీఎం ఫైనల్ చేసే అవకాశం ఉంది.  వాస్తుకు అనుగుణంగా సీఎం చెప్పిన మార్పులను ఆయా కంపెనీలకు తెలియజేస్తం’’ అని ఓ సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు.

కూల్చివేత, నిర్మాణం పనులు ఒకే కంపెనీకి!

కొత్త సెక్రటేరియట్ డిజైన్ ఫైనల్ కాగానే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలువనుంది. పాత సెక్రటేరియట్ ను కూల్చివేత,  కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను ఒకే కంపెనీకి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు ఆర్  అండ్​ బీ  ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంప్లోజివ్ పద్ధతిలో పాత సెక్రటేరియట్ ను కూల్చివేయాలని ప్లాన్ చేస్తున్నారు. కూల్చివేత, వాటి శిథిలాలను డంప్ యార్డుకు తరలించడం.. అక్కడ పూర్తిగా చదును చేయటం వంటి పనులకు  కనీసం మూడు నెలలు టైం పట్టొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ప్రగతి భవన్ ను నిర్మించిన, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ ను పనులు చేపడుతున్న కంపెనీకే పాత సెక్రటేరియట్​ కూల్చివేత, కొత్త సెక్రటేరియట్​ నిర్మాణ పనులు అప్పగించే చాన్స్​ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

25 ఎకరాలు, రూ. 500 కోట్ల ఖర్చు

కొత్త సెక్రటేరియట్ ను మొత్తం 25 ఎకరాల్లో  రూ. 500 కోట్లతో నిర్మించనున్నట్లు ఇప్పటికే  సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుత సెక్రటేరియట్ సుమారు 23 ఎకరాల్లో ఉండగా.. మింట్ కంపౌండ్  వైపు ఉన్న రాతి కట్టడంలోని విద్యుత్ ఆఫీస్​ను కూడా కూల్చివేయనున్నారు. ఈ భవనంలో ఉన్న ఆఫీసు సామాన్లను ఇప్పటికే ఎర్రగడ్డలోని విద్యుత్ శాఖ ఆఫీస్​కు షిఫ్ట్ చేశారు. కొత్త సెక్రటేరియట్ లో ఎక్కువ శాతం స్థలం గ్రీనరీకి, పార్క్​లు, పార్కింగ్ కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి కల్లా పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు స్టార్ట్ చేసినా దసరా కల్లా పూర్తి చేసి.. దసరా నుంచి కొత్త సెక్రటేరియట్ పనులు ప్రారంభించి వచ్చే ఏడాది దసరా కల్లా పూర్తి చేయాలని టెండర్ దక్కించుకునే కంపెనీకి ప్రభుత్వం స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలపై కరోనా పంజా