పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల పోరుబాట..జూన్ 18న చలో హైదరాబాద్

పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ల పోరుబాట..జూన్ 18న చలో హైదరాబాద్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో తమకు రావాల్సిన రూ. 20 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి. రవీందర్ రెడ్డి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ను సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అసోసియేషన్ పరిధిలోని చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, గిరిజన సంక్షేమం వంటి ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశారని తెలిపారు. 

కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించి టోకెన్ నెంబర్లు కూడా రిలీజ్ అయ్యాయని, కానీ, ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి. సత్యమూర్తి,  నాయకులు డీవీఎన్ రెడ్డి, సీహెచ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.