కూల్ గా..హాయిగా కూర్గ్​

కూల్ గా..హాయిగా కూర్గ్​
  • పశ్చిమ కనుమల్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కూర్గ్
  • స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి 
  • పచ్చని చెట్లు, జలపాతాలతో  ఆకట్టుకుంటున్న కూర్గ్
  • మనదేశంలో కాఫీ ఎక్కువగా పండించేది కూర్గ్ లోనే

పశ్చిమ కనుమల్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కూర్గ్. దీన్నే ‘కొడగు’ అని కూడా అంటారు. కర్ణాటకలో ఉన్నఈ ప్లేస్ కాఫీ తోటలకు ఫేమస్. మనదేశంలో కాఫీ ఎక్కువగా పండించేది ఇక్కడే.  కూర్గ్​ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. కారణం... స్కాట్లాండ్​లో ఉన్నట్టే ఇక్కడ కూడా పచ్చదనం, రకరకాల పూల మొక్కలు, చెట్లతో నిండిన అందమైన లోయలు ఉంటాయి. సముద్రమట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడికి వెళ్లే దారంతా... ఏటవాలుగా కనిపించే కాఫీ తోటలు, వంకర్లు తిరిగిన రోడ్లతో ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.  

ట్రెక్కింగ్​కు ఫేమస్

కొండలు, గుట్టలు, పెద్ద చెట్లతో ఆహ్లాదంగా ఉండే కూర్గ్​లో ట్రెక్కింగ్​ని  చాలా ఎంజాయ్ చేస్తారు  టూరిస్ట్​లు. ఇక్కడి కాఫీ తోటల్లో నచ్చినంత సేపు తిరగొచ్చు. సాయంత్రం పూట రకరకాల పక్షుల్ని చూస్తూ హాయిగా గడిపేయొచ్చు. ఇక్కడికి వెళ్లడానికి టూర్ ప్యాకేజీలు ఉంటాయి.  రెండు రోజుల టూర్​ ప్లాన్ చేసుకుంటే కూర్గ్ మొత్తం చూడొచ్చు.

కొడవ తెగ ప్రజలు

ఈ కొండ ప్రాంతంలో ‘కొడవ’ తెగవాళ్లు నివసిస్తుంటారు. వీళ్లు ‘కొడవ’ భాష మాట్లాడతారు. వీళ్లంతా యుద్ధవిద్యల్లో ఆరితేరినవాళ్లు. పెండ్లిండ్లు, ఇతర వేడుకల్లో కత్తులు, బల్లెం, బాణాలు, తుపాకుల్ని చేత పట్టుకుంటారు. పూర్వీకులతో పాటు ఆయుధాల్ని పూజిస్తారు. టూరిస్ట్​లకు ఆతిథ్యం కూడా ఇస్తారు. అంతేకాదు మనదేశంలో లైసెన్స్ లేకుండా తుపాకీ ఉపయోగించేం దుకు ఈ తెగ ప్రజలకు అనుమతి ఉంది. 

ఇవి కూడా..

కూర్గ్ హిల్​స్టేషన్​ దగ్గర్లో ప్రసిద్ధ టిబెటన్ దేవాలయం ‘బైలకుప్పె’ ఉంటుంది. ఇది మనదేశంలోనే రెండో పెద్ద టిబెటన్​ గుడి. కావేరీ నది మీద ఉన్న అబే వాటర్​ఫాల్​ని కూడా చూడొచ్చు. కూర్గ్​లో చూడాల్సిన మరో ప్లేస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్.  ఏనుగులకి మేత వేయొచ్చు. వాటికి స్నానం కూడా చేయించొచ్చు.    
ఎండాకాలంలో చాలామంది హిల్​స్టేషన్లలో సేదతీరాలి అనుకుంటారు. ఎందుకంటే... ఇక్కడికి వెళ్తే ఎత్తైన కొండలు, వాటి మధ్య ప్రవహించే సెలయేర్లు, దూకే జలపాతాలు, పచ్చని చెట్లని చూస్తూ  ప్రకృతిని ఆస్వాదించొచ్చు. వేసవిలో చల్లగా ఉండే ఇలాంటి ప్లేస్​లలో హాయిగా గడపొచ్చు.  కర్నాటకలోని కూర్గ్​ హిల్​స్టేషన్ సమ్మర్​ టూర్​కి బాగుంటుంది. వీకెండ్​లో ఇక్కడికి వెళ్తే మనసు నిండా అందమైన జ్ఞాపకాల్ని  పోగేసుకోవచ్చు.