పద్మారావునగర్, వెలుగు: విగ్రహాల ఏర్పాటు, బ్యూటిపికేషన్పనుల్లో అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం, బ్యూటిఫికేషన్ పనులకు ఏకంగా రూ 2.50 కోట్లు ఖర్చు అయిందనడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్చేశారు. త్వరలోనే విగ్రహాల ఖర్చు, పనులపై వివరాలు సేకరించి, అవినీతి బయట పెడతానని హెచ్చరించారు. ఎంజీ రోడ్డులోని చారిత్రక పంచలోహ గాంధీ విగ్రహాన్ని ప్యారడైజ్టాకీస్ అధినేత అంజయ్య గౌడ్ఇటలీలో తయారు చేయించి, 1952 లో ఇక్కడ ఏర్పాటు చేసి, అప్పటి ప్రధాని నెహ్రుతో ప్రారంభోత్సవం చేయించారని గుర్తుచేశారు.
దీనిపై అవగాహన లేని మంత్రి తలసాని శ్రీనివాస్.. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతో దాత అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులకు చెప్పకుండా చారిత్రక విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారన్నారు. తమతో పాటు చారిత్రక కారులు తీవ్రంగా వ్యతిరేకిస్తే, విధిలేక ప్రభుత్వం చివరికి గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న బస్ షెల్టర్‌తొలగించి కొత్త విగ్రహాన్ని పెట్టిందన్నారు. ఇరుకైన స్థలంలో కాకుండా విశాలంగా వేరేచోట పెడితే అందరికీ సౌకర్యకరంగా ఉండేదన్నారు.
