ఇంజినీరింగ్​లో మేనేజ్​మెంట్​ సీట్లకూ  కౌన్సెలింగ్!

ఇంజినీరింగ్​లో మేనేజ్​మెంట్​ సీట్లకూ  కౌన్సెలింగ్!
  •     సీట్ల అమ్మకాలకు చెక్ పెట్టనున్న ఉన్నత విద్యాశాఖ
  •     వచ్చే ఏడాది నుంచి అమలు చేసే యోచన
  •     మెరిట్​ను పక్కన పెట్టడంపై టీఏఎఫ్ఆర్సీకి ఫిర్యాదులు
  •     ఇదే విషయంపై కోర్టులో నడుస్తున్న కేసు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్​మెంట్​ కోటా సీట్ల అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నత విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. కన్వీనర్ కోటా మాదిరిగానే మేనేజ్​మెంట్​ కోటా సీట్లనూ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని భావిస్తోంది. ఇదే అంశంపై కోర్టులో కేసు నడుస్తుండడంతో దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో 161 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వాటిలో లక్షకుపైగా సీట్లున్నాయి. వీటిలో 70% కన్వీనర్ కోటా ద్వారా ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ  చేస్తోంది. మిగిలిన 30% సీట్లను మేనేజ్​మెంట్​ కోటా కింద యాజమాన్యాలే నింపుకునే అవకాశముంది. అయితే ఆ కోటా సీట్లకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తున్నా మేనేజ్​మెంట్లు  నిబంధనలను పాటించడం లేదు.

ఎక్కువ డబ్బులిచ్చినోళ్లకే సీటు

జేఈఈ, ఎంసెట్ ర్యాంకు, మెరిట్ ఆధారంగా సీట్లను  నింపాల్సి ఉండగా, అవేవీ పట్టించుకోవడం లేదు. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీట్లను అమ్ముకుంటున్నారు. ఈ విషయమై ఫిర్యాదులు వస్తున్నా..  విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది టీఏఎఫ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి. దీంతో స్టూడెంట్ల నుంచి మేనేజ్​మెంట్​ కోటా అప్లికేషన్లు తీసుకొని కాలేజీలకు పంపించాయి. కానీ మేనేజ్​మెంట్లు ఈ అప్లికేషన్లను లెక్కలోకి తీసుకోలేదు. దీంతో టీఏఎఫ్ఆర్సీ అధికారులకు స్టూడెంట్లు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సీట్లు నింపితే, ఒక్కో సీటుకు రూ.10 లక్షల ఫెనాల్టీ వేయాలని  నిర్ణయించారు. సర్కారు నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే ఒక్కో అడ్మిషన్​కు రూ.2 లక్షలు ఫైన్​ వేయనునట్టు టీఏఎఫ్ఆర్సీ ప్రకటించింది. ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తోంది. ఇటీవల మేనేజ్​మెంట్ ​కోటా సీట్లనూ సర్కారే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని హైకోర్టులోనూ కొందరు కేసు వేశారు. ఏటా దాదాపు అన్ని కాలేజీల్లోనూ ఇదేతంతు నడుస్తున్నట్టు గుర్తించిన అధికారులు, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మేనేజ్​మెంట్​కోటా సీట్లనూ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే  సర్కారు దృష్టికి తీసుకుపోవాలని అధికారులు నిర్ణయించారు. సర్కారు అంగీకరించే అవకాశముందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. దీంతో వచ్చే ఏడాది మేనేజ్​మెంట్​ కోటా సీట్లనూ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ  చాన్స్​ ఉంది.