- పరారీలో ప్రధాన నిందితుడు
ఓల్డ్‌సిటీ వెలుగు: నకిలీ నోట్లను అసలు నోట్లుగా నమ్మించి ఏకంగా బ్యాంక్ క్యాష్ రీసైక్లర్ మెషీన్ (సీఆర్ఎం) లోనే డిపాజిట్ చేసిన నిందితుడిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.94 వేల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మంగళవార చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, మలక్‌పేట్ ఏసీపీ కె.సుబ్బారామి రెడ్డి కలిసి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 7న మలక్‌పేటలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లో రూ.500 ముఖ విలువ కలిగిన 10 నకిలీ నోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని చాంద్రాయణగుట్ట హఫీజ్ బాబా నగర్‌కు చెందిన అహ్మద్ పాషా (33)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి నుంచి షాద్‌నగర్ వద్ద రూ.90 వేల నకిలీ నోట్లను తీసుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. ఇందులో రూ.5 వేలను బ్యాంకులో డిపాజిట్ చేయగా, మిగిలిన రూ.89 వేలు (178 నోట్లు) నిందితుడి నివాసంలో లభించాయి. ఈ కేసులో ప్రధాన సరఫరాదారు గుజరాత్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.

