సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 5 రోజుల కస్టడీ

సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 5 రోజుల కస్టడీ

యాదాద్రి భువనగిరి : అమ్మాయిల హత్య కేసులో సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో లోతుగా విచారించేందుకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని రాచకొండ పోలీసులు నల్గొండ మొదటి అదనపు జిల్లా కోర్టును నిన్న ఆశ్రయించారు. కేసు విచారణ అధికారి, భువనగిరి ఏసీపీ భుజంగరావు అర్జీ మేరకు పబ్లిక్‌ ప్య్రాసిక్యూటర్‌ నలమాద గోపాలకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. మొదటి అదనపు జిల్లా కోర్టుకు సెలవులు ఉండటంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి ఈ పిటిషన్‌ను స్వీకరించి విచారణ చేపట్టారు.

విద్యార్థినుల వరుస హత్యల కేసు పూర్వాపరాలు, పూర్తిస్థాయిలో దర్యాప్తునకు మరిన్ని ఆధారాలు కావాలంటే నిందితుడిని తాము విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడిపై ఇతరత్రా నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయా.. అనే కోణంలోనూ విచారణ జరగాల్సి ఉందన్నారు. వాదనలు విన్న తర్వాత జడ్జి.. నిందితుడిని ఈ నెల 8వ తేదీ నుంచి ఐదు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.