కార్పొరేషన్ ఎన్నికల బరిలో సీపీఐ.. ఆగస్టు 6 నుంచి 14 వరకు నియోజకవర్గాల్లో ప్రచార యాత్రలు: కూనంనేని సాంబశివరావు

కార్పొరేషన్ ఎన్నికల బరిలో సీపీఐ.. ఆగస్టు 6 నుంచి 14 వరకు నియోజకవర్గాల్లో ప్రచార యాత్రలు: కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: రానున్న కార్పొరేషన్ ఎన్నికలు ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికలని, ప్రజల మధ్య నిరంతరం పనిచేసే సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికల బరిలోకి దిగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్ భవన్‌‌‌‌లో సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన మేడ్చల్ -మల్కాజ్‌‌‌‌గిరి జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ధ్వంసం, విద్యా-వైద్య రంగాల ప్రైవేటీకరణ, కార్మిక-రైతు వ్యతిరేక విధానాల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ నెల 6 నుంచి14 వరకు అన్ని నియోజకవర్గాల్లోని బలమైన డివిజన్లలో ప్రచార యాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.