మోడీ ఒక డమ్మీ ప్రధాని.. ట్రంప్ డిఫాక్టో ప్రధాని వ్యవహరిస్తుండు: సీపీఐ నారాయణ విమర్శలు

మోడీ ఒక డమ్మీ ప్రధాని.. ట్రంప్ డిఫాక్టో ప్రధాని వ్యవహరిస్తుండు: సీపీఐ నారాయణ విమర్శలు

హైదరాబాద్: ప్రధాని మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ఒక డమ్మీ ప్రధానిగా.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ డిఫాక్టో ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మన ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యూఎస్‎లోని ఇండియన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు సమ్మె చేస్తే అమెరికన్ ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులు తమ దేశాలకు డబ్బు పంపితే ఐదు శాతం ట్యాంక్ వసూల్ చేస్తామని ట్రంప్ అన్నాడు.

ఆల్రెడీ వాళ్ల జీతాల మీద ఉద్యోగులు పన్నులు కడుతున్నారు.. మళ్ళీ ఐదు శాతం ట్యాక్స్ వేయడం సబబు కాదన్నారు. ఇది భారత దేశానికి అపార నష్టమని.. దీనిని ప్రధాని మోడీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు బీజేపీ ఎంపిక చేసిన దౌత్య బృందాలను పార్టీలకు సంబంధం లేకుండా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎలాగో లేదు.. కనీసం పార్టీలకు రాజకీయ ప్రజాస్వామ్యం కూడా ఉండొద్దా అని నిలదీశారు. 

బీజేపీ ఏకపక్ష తీరుగా నిరసనగా.. టీఎంసీ ఎంపీలు వెళ్లరని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారని.. కాంగ్రెస్ కూడా అలాగే ప్రకటన చేయాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీల నుంచి అసలే ఎంపీలను ఎంపిక చేయకపోవడం సరైంది కాదన్నారు. టెర్రరిస్టు ఘాతుకాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ సొంత రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. 

దేశ రక్షణ కోసం అన్ని పార్టీలు మోడీకి మద్దతు ఇచ్చాయి. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాల్సింది పోయి మోడీ సొంత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఘటనకు రెండు రోజుల ముందే.. తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారని అక్కడ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చెప్పారు. మరీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియదని ప్రశ్నించారు. సైనికుల మీద బీజేపీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోలేదు.. అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చే శారు.