తమ్మినేనిపైఅభిశంసన... అవినీతి, తప్పుడు నిర్ణయాలపై సీపీఎం కేంద్ర కమిటీ సీరియస్

తమ్మినేనిపైఅభిశంసన... అవినీతి, తప్పుడు నిర్ణయాలపై సీపీఎం కేంద్ర కమిటీ సీరియస్
  • మరో ఇద్దరు నేతలపై కూడా ఇదే తీర్మానం
  • ద్విసభ్య కమిటీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా హైకమాండ్ నిర్ణయం
  • వరుస వైఫల్యాలు, కార్యదర్శి ఎంపికలో తమ్మినేని తీరుపై అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పార్టీ ప్రతిష్ట మసకబారడం, ఎన్నికల్లో వరుసగా ఘోర పరాజయాలు, అగ్రనేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీపీఎం కేంద్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని దెబ్బతీయడం వంటి అంశాలపై దృష్టి సారించి.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్‌‌‌‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. 

సోమవారం హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఎం పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో తమ్మినేనితోపాటు మరో ఇద్దరిపై కేంద్ర కమిటీ అభిశంసన తీర్మాన ప్రతులను రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు అందజేశారు. కాగా, మధురైలో జరిగిన సీపీఎం పార్టీ జాతీయ సదస్సులో కేంద్ర కమిటీ పనితీరుతోపాటు లోపభూయిష్ట విధానాల వల్లే తెలంగాణలో పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని తమ్మినేని విమర్శలు చేసినట్లు సమాచారం. 

దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేదానిపై సెంట్రల్​ కమిటీ శ్రీదీప్ భట్టాచార్య, బాలకృష్ణన్​తో ద్విసభ్య కమిటీ వేసింది. తెలంగాణలో పార్టీ తీరు, గతంలో తమ్మినేని రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు పార్టీ నడిపిన విధానంపై లోతైన విచారణ చేపట్టినట్లు తెలిసింది. 

నిర్ణయాల్లో లోపాలు.. పార్టీ అస్తిత్వానికే ముప్పు

సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మినేని వీరభద్రం తీసుకున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ అస్తిత్వానికే ముప్పు తెచ్చాయని కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. ఒకప్పుడు శాసనసభలో బలమైన గళం వినిపించిన సీపీఎం.. తమ్మినేని సారథ్యంలో రెండు పర్యాయాలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోవడంపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. 

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పేరిట చేసిన ప్రయోగం విఫలమవడం.. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఊగిసలాట, చివరి నిమిషంలో ఒంటరిపోరు నిర్ణయం వంటివి పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేశాయి. ఇదంతా తమ్మినేని స్వయంకృతాపరాధమేనని హైకమాండ్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. 

కార్యదర్శి ఎంపికతో మొదలైన విభేదాలు 

ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యదర్శి ఎంపిక ప్రక్రియలోనూ తమ్మినేని వీరభద్రం వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పార్టీపై తన పట్టును నిలుపుకునేందుకు తనకు అనుకూలమైన వ్యక్తినే కార్యదర్శిగా నిలబెట్టారని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర కమిటీ ఓ వ్యక్తి పేరు ప్రతిపాదించినప్పటికీ లెక్క చేయకుండా మరో వ్యక్తిని నియమించి ఓటింగ్​కు దారితీశారనే విమర్శ ఉంది. దీనివల్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిందని, గ్రూపు రాజకీయాలు పెరిగాయని సీసీ గుర్తించింది.