- కానిస్టేబుల్ సౌమ్యను హత్య చేయడాన్ని ఖండిస్తున్నం: జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామానికి చెందిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య డ్రగ్స్ మాఫియా చేతిలో బలవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆమెను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు విచారణకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు.
డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా అంతమొందించాలన్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో డ్రగ్స్ మాఫియా అరాచకాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారుగానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. ప్రతి జిల్లాలో డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా సాగుతోందని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.
డ్రగ్స్ మూలంగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయని, నెల్లూరులో సీపీఎం కార్యకర్త పెంచలయ్య, ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ సౌమ్యను హత్య చేయడం వారి తెగింపుకు నిదర్శనమన్నారు.
