హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలు పూర్తిగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయని, ప్రభుత్వ రంగ విద్యాసంస్థలను ప్రభుత్వం గాలికొదిలేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బాగ్ లింగంపల్లి పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా రూ. 25 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయని, సామాన్యులకు విద్య భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని, టీచర్ల కొరత వేధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని, కార్పొరేట్ ఆస్పత్రులు సామాన్యులను నిలువు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు.
వైద్య రంగంలోనూ ఫీజుల నియంత్రణ చట్టం అవసరమని తెలిపారు. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. కొత్త ఉద్యోగాల భర్తీలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
