టెక్స్​టైల్ ​పార్క్ లో సంక్షోభం

టెక్స్​టైల్ ​పార్క్ లో సంక్షోభం


    విద్యుత్ ​చార్జీల భారం.. వ్యాపారంలో నష్టం
    బతుకమ్మ ఆర్డర్ల క్యాన్సిల్.. ప్రైవేట్​ఆర్డర్లు వస్తలేవు
    పవర్​ రీయింబర్స్​మెంట్ హామీని పట్టించుకోని కేటీఆర్​
    ప్రశ్నార్థకంగా మారిన కార్మికుల ఉపాధి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా టెక్స్​టైల్ ​పార్క్ లో సంక్షోభం నెలకొంది. విద్యుత్ ​చార్జీల భారం మోయలేక, పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా మార్కెటింగ్​ లేక, బతుకమ్మ చీరల ఆర్డర్ల రద్దుతో టెక్స్​టైల్ ​పార్క్​లోని పరిశ్రమలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. వచ్చే నెల 1 నుంచి టెక్స్​టైల్ ​పార్క్​లోని అన్ని యూనిట్లను బంద్ ​చేయాలని యజమానులు నిర్ణయించారు. 2002లో ప్రారంభమైన సిరిసిల్ల టెక్స్​టైల్​పార్క్ ​1,200 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, 2000 మంది కార్మికులకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. టెక్స్​టైల్ ​పార్క్​లో 112 యూనిట్లు ఉన్నాయి. మొదట్లో పరిశ్రమలు లాభాల బాటలోనే నడిచాయి. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత పనిభారం పెరిగింది. దాంతో ప్రైవేట్​ఆర్డర్లు తగ్గించారు. ముంబయ్, మహారాష్ట్రకు చెందిన ప్రైవేట్​ఆర్డర్లు ప్రస్తుతం సిరిసిల్లకు రావడం లేదు. అదే సమయంలో ఈ ఏడాది టెక్స్​టైల్​ పార్క్​కు బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేస్తూ చేనేత జౌళిశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో టెక్స్​టైల్ ​పార్క్​లోని పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రంజాన్, ఆర్వీఎం, ఇతర ఆర్డర్లు ఇచ్చినా.. వాటితో వారం రోజుల పని కూడా దొరకడం లేదు. దీనికి తోడు విద్యుత్​ చార్జీల భారం పరిశ్రమపై పడింది. యూనిట్​కు రూ. 3.75 పైసలున్న విద్యుత్​చార్జీలు ప్రస్తుతం యూనిట్​కు రూ.8 చేశారని యజమానులుపేర్కొంటున్నారు. సిరిసిల్లలో విద్యుత్​ రాయితీ 50 శాతం ఇస్తుండగా టెక్స్​టైల్​పార్క్​కు ఇవ్వడం లేదని వాపోతున్నారు.  రాయితీకి సంబంధించి రీయింబర్స్​మెంట్​ ఇప్పిస్తానని నాలుగున్నరేండ్ల క్రితం మంత్రి కేటీఆర్​ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. దీనికితోడు యారన్​ రేట్లు విపరీతంగా పెరిగాయని అంటున్నారు. ఇప్పటికే ఒక్కో యూనిట్​రూ. 2 లక్షల నుంచి 6 లక్షల వరకు విద్యుత్​ బిల్లులు బకాయి పడ్డాయి. ఇబ్బందులను ఎదుర్కొంటూ పరిశ్రమలు నడిపిస్తే నెలకు రూ.లక్షకు పైగా ఒక్కో యూనిట్​పై నష్టం వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు వస్తాయని నమ్మి ప్రైవేట్​ఆర్డర్లన్నీ రద్దు చేసుకున్నామని.. ఇప్పుడు పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సగం ధరకే సాంచాలు అమ్ముకుంటున్రు

సిరిసిల్లలో పవర్​లూంస్​ అప్​గ్రేడేషన్​లో భాగంగా టెక్స్​టైల్ ​పార్క్​లో రాపియర్స్​ఒక్కోటి రూ.4.50 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పుడు పరిశ్రమలు నడవక, ఆర్థిక నష్టాలను తట్టుకోలేక చిన్నతరహా పరిశ్రమల యజమానులు ఆధునిక మరమగ్గాలను తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రోజుకు రెండు నుంచి మూడు భారీ వెహికల్స్​లో ఈ మరమగ్గాలు తరలిపోతున్నాయి. 112 యూనిట్లకు గాను కేవలం 30 యూనిట్లే ప్రస్తుతం రన్​అవుతున్నాయి. పరిశ్రమలు మూతపడితే కార్మికుల ఉపాధిపై దెబ్బ పడి రోడ్డున పడే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

పరిశ్రమను ఆదుకోవాలె

మంత్రి కేటీఆర్​పైనే సిరిసిల్ల టెక్స్​టైల్​ పార్క్​మనుగడ ఆధారపడి ఉంది. విద్యుత్​రీయింబర్స్​​మెంట్​ఇప్పించడంతోపాటు నష్టాల్లో కూరుకుపోయిన యూనిట్లను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు పునరుద్ధరించాలి. పార్క్​పై సుమారు 2,500 మంది కార్మికులు ఆధారపడటమే కాకుండా అప్పులు చేసి యజమానులు పెట్టుబడులు పెట్టారు. మంత్రి కేటీఆర్ ​టెక్స్​టైల్​ పార్క్ ​యూనిట్లపై దయ చూపి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలి.
- అన్నల్​దాస్​ అనిల్, టెక్స్​టైల్​ పార్క్​యజమానుల సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల

ఏటా 50 లక్షల మీటర్ల ఆర్డర్లు

ఏటా రూ. 300 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లను సర్కారు సిరిసిల్ల పవర్​లూంస్​కు ఇస్తోంది. ఇందులో రూ. 15 కోట్ల విలువైన ఆర్డర్​ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం టెక్స్​టైల్ ​పార్క్​లోని యూనిట్ల ద్వారా చేస్తున్నారు. గత మూడేండ్లుగా టెస్కో ద్వారా ప్రభుత్వం ఇలా 50 లక్షల మీటర్ల బతుకమ్మ చీరల​ ఆర్డర్​ ఇస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం టెక్స్​టైల్ ​పార్క్​కు బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేశారు. దీనికి తోడు ప్రధానంగా విద్యుత్​చార్జీల భారం పరిశ్రమలపై పడడంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.