హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన లేక పెనాల్టీ పాలన అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ చలాన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం జనంపై భారాలు మోపుతున్నదని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. కేవలం ఏడాది కాలంలోనే ట్రాఫిక్ చలాన్ల వసూళ్లు ఏకంగా 154 శాతం పెరిగాయని గణాంకాలతో ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. గతంలో రూ. 108.33 కోట్లుగా ఉన్న ట్రాఫిక్ చలాన్ల వసూళ్లు..
కాంగ్రెస్ పాలనలో ఏడాదిలోనే రూ. 275.05 కోట్లకు చేరాయని బండి సంజయ్ తెలిపారు. అంటే ఇది గతంలో కంటే 2.5 రెట్లు ఎక్కువని ఆయన గుర్తు చేశారు. వసూళ్లు అయితే 2.5 రెట్లు పెరిగాయనీ, మరి రోడ్లు ఏమైనా 2.5 రెట్లు బాగుపడ్డాయా.. రోడ్లమీద గుంతలు మాయమయ్యాయా అని ప్రశ్నించారు. అవేవీ జరగలేదు కానీ.. ఫైన్లు మాత్రం డబుల్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఆటో- డెబిట్ విధానం తెస్తామంటున్నారని విమర్శించారు. ‘నేరుగా బ్యాంక్ అకౌంట్ల నుంచి చలాన్ డబ్బులు కట్ చేసుకుంటారన్నమాట’ అని ఎద్దేవా చేశారు. Union Minister Bandi Sanjay
