సీరియస్‌గా గోల్ఫ్ఆడుకుంటుంటే మధ్యలో ఓ మొసలి అడ్డొస్తే… ఆటొద్దు ఏమొద్దని పరుగందుకుంటారు కదా! కానీ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన గోల్ఫర్ స్టీల్లా ఫెర్టీ మాత్రం ఆటను ఆపలేదు. ఆ మొసలిని చంపే ప్రయత్నమూ చేయలేదు. దాదాపు ఏడు ఫీట్ల పొడవున్న మొసలి పక్క నుంచే వెళుతున్నా పట్టించుకోలేదు. నీ దారి నీది.. నా ఆట నాదన్నట్లు కామ్‌గా ఆటను కొనసాగించాడు. అయితే, మొసలి రాకతో ఏకాగ్రత కాస్త చెదిరిపోయిందని తర్వాత చెప్పాడు.
ఓర్లాండో కంట్రీ క్లబ్లో జరిగిన ఈ సంఘటనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్క రోజులోనే 80 వేల మంది చూశారు. వందల కొద్దీ కామెంట్లు పెట్టారు. అదేం పిచ్చిపని.. మొసలి దాడిచేస్తే ఏమై ఉండేదని ఒకరు.. ఇది నిజంగా పిచ్చితనమేనని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో గురించి ఓ న్యూస్ ఏజెన్సీతో లాఫెర్టీ మాట్లాడుతూ.. ‘ఫ్లోరిడాలో ఇలా మొసళ్లు కనిపించడం తరచుగా జరిగేదే. అందుకే నాకేం ఆశ్చర్యమనిపించలేదు. ఏమాటకామాట చెప్పుకోవాలి. కొంత భయమైతే అనిపించింది. అక్కడ నేనొక్కడిని ఉన్నట్లు ఆ మొసలి గుర్తించనేలేదనుకుంటా.. తన మానాన తను వెళ్లిపోయింది. అనవసరంగా ఎగిరి గంతులేసి దాని దృష్టిని ఆకర్షించడం ఎందుకని నేనూ పట్టించుకోలేదు’ అన్నారు.
