- వారం రోజుల్లో ఖరారవ్వనున్న విధివిధానాలు
- ఉద్యోగుల 1.5% చందాకు తగ్గట్లే ప్రభుత్వ వాటా.. అదే రోజు ట్రస్ట్ ఖాతాలోకి జమ
- జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎస్ రామకృష్ణారావు మీటింగ్
- భార్యాభర్తల్లో ఒక్కరికే కోత, 25 ఏండ్లు దాటిన పిల్లలకూ వర్తింపు
- ఆయుష్ చికిత్సలు, ఇతర రాష్ట్రాల్లో వైద్యానికి అనుమతించాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ విజ్ఞప్తి
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధిని పర్యవేక్షించే 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' ఒక స్వయంప్రతిపత్తి (అటానమస్) సంస్థగా పనిచేస్తుందని సీఎస్కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఉద్యోగులు అందించే 1.5% కాంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వ వాటాను సైతం అదే రోజున ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ఈ పథకం పర్యవేక్షణకు రెండు మూడు రోజుల్లో ప్రత్యేక ఈహెచ్‌ఎస్ కమిటీని ఏర్పాటు చేసి..వారంలో పూర్తి నిబంధనలు, విధివిధానాలకు తుది రూపం ఇస్తామన్నారు.
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎస్ కె. రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) అమలుపై సోమవారం ఆయన సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధిని పర్యవేక్షించే 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' ఒక స్వయంప్రతిపత్తి (అటానమస్) సంస్థగా పనిచేస్తుందన్నారు. ఉద్యోగులు అందించే 1.5% కాంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వ వాటాను సైతం అదే రోజున ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ఈ పథకం పర్యవేక్షణకు రెండు మూడు రోజుల్లో ప్రత్యేక ఈహెచ్‌ఎస్ కమిటీని ఏర్పాటు చేసి..వారంలో పూర్తి నిబంధనలు, విధివిధానాలకు తుది రూపం ఇస్తామన్నారు.
పారదర్శకత అవసరం
ఈ ఆరోగ్య పథకం ఆర్థికంగా నిలకడగా ఉండాలంటే ఉద్యోగి, ప్రభుత్వం సమాన వాటాను నేరుగా హెల్త్ కేర్ ట్రస్ట్ ఖాతాలోనే జమ చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ కోరారు. బేసిక్ పే ఆధారంగా 1.5% కోత విధిస్తే.. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉండి, ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉన్న సీనియర్ ఉద్యోగులపై మోయలేని భారం పడుతుందని ఉదాహరణలతో వివరించారు. దీనికి బదులుగా నాన్-గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యోగులకు వేర్వేరు స్లాబ్‌లతో కూడిన మూడు-స్థాయిల కంట్రిబ్యూషన్ విధానాన్ని తేవాలన్నారు. అలాగే.. ఆసుపత్రుల జాబితా, చికిత్సల ప్యాకేజీలు, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ సేవల పూర్తి వివరాలను ముందే ప్రచురించి, ఉద్యోగులందరికీ పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే హెల్త్ కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు. కుటుంబ పరిమాణాలు వేర్వేరుగా ఉండే ఉద్యోగులందరికీ ఒకే రకమైన కోత విధించడం సమానత్వానికి విరుద్ధమని, అందుకే కుటుంబంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగానే నామమాత్రపు కంట్రిబ్యూషన్ నిర్ణయించాలని నేతలు సూచించారు. చందా వసూలు చేస్తున్నందున, ఆధారపడిన పిల్లలకు వయస్సు పరిమితితో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజ్ కొనసాగించాలన్నారు. ఈ మార్పుల వల్ల ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులు వేగంగా జరిగి నగదు రహిత వైద్యం నిరంతరాయంగా అందుతుందని, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
